కొవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ గుర్తించిన యూకే

The British government recognized the covaxin vaccine. కొవిడ్‌ నియంత్రణ కోసం భారతదేశం రూపొందించిన కొవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ను బ్రిటన్‌ ప్రభుత్వం గుర్తించింది.

By అంజి  Published on  9 Nov 2021 4:19 PM IST
కొవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ గుర్తించిన యూకే

కొవిడ్‌ నియంత్రణ కోసం భారతదేశం రూపొందించిన కొవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ను బ్రిటన్‌ ప్రభుత్వం గుర్తించింది. అంతర్జాతీయ రాకపోకలను సులభతరం చేసేందుకు యూకే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో ఇది ఒకటి. గుర్తించిన కొవిడ్‌ టీకాల జాబితాలో కొవాగ్జిన్‌ను చేర్చుతున్నట్లు ప్రకటించింది. ఈ నెల 22 నుంచి కొవాగ్జిన్‌ తీసుకున్న వారు బ్రిటన్‌కు వచ్చిన తర్వాత ఐసోలేషన్‌ ఉండాల్సిన అవసరం లేదని తెలిపింది. కొవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ను భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసింది. ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా అత్యవసర వినియోగ జాబితాలో కొవాగ్జిన్‌ను చేర్చింది.

బ్రిటన్‌ ప్రభుత్వం ఇప్పటికే కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ను గుర్తించింది. తాజాగా కొవాగ్జిన్‌ గుర్తిస్తున్న విషయాన్ని ధ్రువీకరిస్తూ బ్రిటిష్‌ హైకమిషనర్‌ అలెక్స్‌ ఎలిస్‌ ట్వీట్‌ చేశారు. యూకేకు వచ్చే భారత ప్రయాణికులకు మరో గుడ్‌న్యూస్‌. నవంబరు 22వ తేదీ నుండి కొవాగ్జిన్‌తో సహా ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర వినియోగానికి గుర్తించిన టీకాలు వేసుకొని ఇక్కడికి చేరుకున్నాక ఐసొలేషన్‌లో ఉండాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఈ కొత్త రూల్స్‌ నవంబర్ 22 తేదీ తెల్లవారుజామున 4 గంటల నుండి అమల్లోకి రానున్నాయి. కొవాగ్జిన్‌తోపాటు చైనాకు చెందిన సినోవాక్, సినోఫార్మ్‌లనూ బ్రిటన్‌ ప్రభుత్వం గుర్తించింది.


Next Story