అమెరికాలో ఓ మహిళ టెస్లా ఎలక్ట్రిక్ వాహనం ఆటోపైలట్‌తో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు.. దాని ముందు సీటులో బిడ్డకు జన్మనిచ్చింది. సెప్టెంబరు 9న ఫిలడెల్ఫియాలో జన్మించిన ఈ పాప ప్రపంచంలోనే తొలి టెస్లా బేబీగా గుర్తింపు పొందింది. యిరాన్ షెర్రీ(33), ఆమె భర్త కీటింగ్ షెర్రీ(34), ఈ సంఘటన జరిగినప్పుడు వారి మూడేళ్ల కొడుకును ప్రీ-స్కూల్‌కు తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలోనే కారు ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయింది. అప్పటికే యిరాన్ షెర్రీకి నొప్పులు మొదలయ్యాయి. యిరాన్ షెర్రీ కదలికలు వేగంగా పెరుగుతున్నందున, ట్రాఫిక్ కదలకపోవడంతో వారు సకాలంలో ఆసుపత్రికి చేరుకోలేరని దంపతులు గ్రహించారు.
భర్త కీటింగ్ షెర్రీ.. కారు ఆటోపైలట్ మోడ్‌ను ఆన్ చేసి, నావిగేషన్ సిస్టమ్‌లో ఆసుపత్రిని గమ్యస్థానంగా సెట్ చేసారు. ఆ తర్వాత ప్రసవ వేదనతో బాధపడుతున్న తన భార్యకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. "ఆమె నా చేతిని గట్టిగా పట్టుకుంది. శ్వాస మీద దృష్టి పెట్టాలని యిరాన్‌కు చెప్పాను." అని భర్త కీటింగ్ షెర్రీ ఎంక్వైరర్‌తో చెప్పాడు. అతడు మాట్లాడుతూ.. ఆసుపత్రికి 20 నిమిషాల ప్రయాణం చాలా బాధ కలిగించిందని, అంచనా వేసిన రాక సమయాన్ని తనిఖీ చేయడానికి జీపీఎస్ వైపు చూస్తూనే ఉన్నానని చెప్పాడు. కారు ఆస్పత్రికి చేరుకునేలోపే పాప పుట్టింది. నర్సులు కారు ముందు సీటు వద్ద బొడ్డు తాడును కత్తిరించారు. ఆమెను 'టెస్లా బేబీ' అని నర్సులు పిలుస్తున్నారు. దీంతో చిన్నారి మేవ్‌కు 'టెస్' అని పేరు పెట్టాలని తల్లిదండ్రులు భావించారట.