భారత్‌కు తాలిబన్ల వార్నింగ్.. ఆ పని చేస్తే ఇక అంతే సంగతులు..!
Taliban warns India on military role in Afghanistan.మరో వారం రోజుల్లో ఆఫ్ఘనిస్థాన్ మొత్తాన్ని స్వాధీనం చేసుకుంటామని
By తోట వంశీ కుమార్ Published on 14 Aug 2021 8:07 AM GMTమరో వారం రోజుల్లో ఆఫ్ఘనిస్థాన్ మొత్తాన్ని స్వాధీనం చేసుకుంటామని తాలిబన్లు ఇప్పటికే ప్రకటించారు. దేశ రాజధాని కాబూల్ మినహా.. 90 శాతం ప్రాంతాలను ఆక్రమించుకున్నారు. తాలిబన్, ఆఫ్ఘన్ ప్రభుత్వాల మధ్య సంధికి ఖతార్ ప్రయత్నాలు చేస్తున్నది. అధికారాన్ని తాలిబన్లతో కలిసి పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ఆఫ్ఘన్ ప్రభుత్వం ప్రతిపాదనలు చేసింది. తాలిబన్ల ప్రభుత్వాన్ని తాము గుర్తించబోమని 12 దేశాలు స్పష్టం చేశాయి. ఇక భారత్ మాత్రం.. అఫ్ఘానిస్తాన్ పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేస్తోంది. తుపాకీ రాజ్యానికి ఒప్పుకునేది లేదని ప్రకటించింది.
ఈ నేపథ్యంలో తాలిబన్ల సంస్థ అధికార ప్రతినిధి సుహైల్ షాహిన్ మాట్లాడుతూ.. తాము ఆప్ఘనిస్థాన్‌లని ఇతర దేశాలకు చెందిన దౌత్య, రాయబార కార్యాలయాలపై దాడులు చేయమని, ఇతరులకు హాని కలిగించమని చెప్పాడు. ఈ సందర్భంగా ఓ తీవ్ర హెచ్చరిక చేశాడు. ఆఫ్ఘనిస్తాన్ సైన్యానికి భారత ప్రభుత్వం సాయం చేస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదంటూ హెచ్చరించాడు. భారత్‌తో తమకు శత్రుత్వం లేదని కానీ అఫ్ఘాన్ ప్రభుత్వానికి, సైన్యానికి అండగా భారత్ తన సైన్యాన్ని తరలిస్తే మాత్రం వారికి మంచిది కాదంటూ ప్రకటించాడు. తమ దేశ విషయాల్లో జోక్యం చేసుకోరాదంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఇటు భారత ప్రతినిధులతో స్వయంగా ఎలాంటి మీటింగ్ జరిగినట్టు స్పష్టం చేయలేమని చెబుతున్న తాలిబన్ అధికార ప్రతినిధి.. దోహాలో జరిగిన సమావేశంలో మాత్రం భారత ప్రతినిధి బృందం పాల్గొన్నట్టు తెలిపాడు.
ఇదే సమయంలో ఇండియాపై ప్రశంసలు కురిపించారు. ఆఫ్గాన్ అభివృద్ధి కోసం భారత ప్రభుత్వం చాలా సహాయం చేసిందని గుర్తుచేశారు. దేశంలో రోడ్లు, ప్రభుత్వ భవనాల నిర్మాణం, జాతీయ ప్రాజెక్టులను నిర్మించిందని నేతలు పేర్కొన్నారు. దేశ ప్రజలు ఎప్పటికీ భారత్‌కు రుణపడి ఉంటారని, కానీ, తమకు వ్యతిరేకంగా మిలిటరీ చర్యలు తీసుకోవాలని భారత్ భావిస్తే.. చూస్తూ ఊరుకోబోమని తాలిబన్ నేతలు హెచ్చరించారు.