ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబాన్ ప్రభుత్వం మరిన్ని ఆంక్షలు విధించాలని భావిస్తోంది. రాబోయే మూడు నెలల్లో దేశంలో వీడియో-షేరింగ్ యాప్ TikTok, ప్రముఖ మొబైల్ గేమింగ్ యాప్ PUBGని నిషేధించాలని యోచిస్తోంది. ఏప్రిల్‌లోనే ఈ రెండు యాప్‌లకు యాక్సెస్‌ను అరికట్టాలని ఆ దేశ ప్రభుత్వం తమ ఉద్దేశాన్ని ప్రకటించింది. అవి ఆఫ్ఘన్ యువతను తప్పుదారి పట్టిస్తున్నాయని పేర్కొంది.
తాలిబాన్ ప్రతినిధి ఇనాముల్లా సమంగాని మాట్లాడుతూ, "యువ తరాన్ని తప్పుదారి పట్టించకుండా నిరోధించడానికి TikTok, PUBG పై నిషేధం అవసరం" అని చెప్పుకొచ్చారు. ఇప్పుడు, టెలికమ్యూనికేషన్ డిపార్ట్‌మెంట్ ఆ తరహా ప్రకటనను ఉటంకిస్తూ, భద్రతా రంగం ప్రతినిధులు, షరియా లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అడ్మినిస్ట్రేషన్ ప్రతినిధితో జరిగిన సమావేశంలో వాటిపై నిషేధం విధించాలని భావిస్తూ ఉన్నామని తెలిపారు. ఆఫ్ఘన్ యువతకు ఎంతో ఇష్టమైన TikTok, PUBGపై నిషేధం రాబోయే 90 రోజుల్లో అమలులోకి వస్తుంది. తాలిబాన్ నేతృత్వంలోని ప్రభుత్వం ఇచ్చే మార్గదర్శకాలను అనుసరించాలని టెలికమ్యూనికేషన్, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లను ఆదేశించింది.
అనైతిక కంటెంట్ ప్రదర్శించినందుకు ఆఫ్ఘనిస్తాన్‌లో 23 మిలియన్లకు పైగా వెబ్‌సైట్‌లను తాలిబాన్ బ్లాక్ చేసిన తర్వాత తాజా నిషేధం అమలులోకి వచ్చింది. వెబ్‌సైట్‌లే కాకుండా, సంగీతం, చలనచిత్రాలు, టెలివిజన్ సీరియల్స్ తో సహా అనేక ఇతర వినోదాలను కూడా తాలిబాన్ నిషేధించింది.