పెళ్ళిళ్ళను కూడా వదలట్లేదు.. అక్కడికి వెళ్లి ఆత్మాహుతి

వాయువ్య పాకిస్తాన్‌లోన ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో శుక్రవారం జరిగిన వివాహ వేడుకలో ఊహించని విషాదం చోటు చేసుకుంది.

By -  Medi Samrat
Published on : 24 Jan 2026 8:50 AM IST

పెళ్ళిళ్ళను కూడా వదలట్లేదు.. అక్కడికి వెళ్లి ఆత్మాహుతి

వాయువ్య పాకిస్తాన్‌లోన ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో శుక్రవారం జరిగిన వివాహ వేడుకలో ఊహించని విషాదం చోటు చేసుకుంది. అతిథుల మధ్య ఉన్న ఓ వ్యక్తి ఆత్మాహుతికి పాల్పడడంతో ఏడుగురు మరణించగా, 25 మంది గాయపడ్డారు. డేరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లాలోని ప్రభుత్వ అనుకూల సంఘ నాయకుడు నూర్ ఆలం మెహ్సూద్ నివాసంలో ఈ దాడి జరిగిందని స్థానిక పోలీసులు తెలిపారు. ఈ పేలుడు కారణంగా ఆ ప్రాంతమంతా రక్తంతో నిండిపోయింది.

దాడి జరిగినప్పుడు అతిథులు నృత్యం చేస్తుండగా, భారీ పేలుడు కారణంగా పైకప్పు కూలిపోయింది. దీనివల్ల సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని చేరుకోవడం కష్టమైంది. ఓ మాజీ ఉగ్రవాదికి సంబంధించిన కుటుంబం కూడా చనిపోయిన వారిలో ఉందని అధికారులు తెలిపారు. ఈ దాడికి బాధ్యత వహిస్తున్నట్లు ఏ సంస్థ వెంటనే ప్రకటించలేదు. అయితే, ఈ ఆత్మాహుతి బాంబు దాడి వెనుక తెహ్రిక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP) హస్తం ఉందని అనుమానిస్తున్నారు.

Next Story