శ్రీలంకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ దేశంలోని సెంట్రల్ ప్రావిన్స్ కోట్మలేలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తు కొండ మీద నుంచి కింద పడిపోయింది. బస్సు కొండపై నుంచి బోల్తాపడటంతో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో 36 మంది గాయపడ్డారని స్థానిక అధికారులు తెలిపారు. ఈ దుర్ఘటన రాజధాని కొలంబోకు తూర్పు దిశగా 140 కిలోమీటర్ల దూరంలోని కోట్మలే పట్టణ సమీపంలో ఈ తెల్లవారుజామున చోటుచేసుకుంది.
శ్రీలంక రహదారులు, రవాణా శాఖ డిప్యూటీ మంత్రి ప్రసన్న గుణసేన మీడియాతో మాట్లాడుతూ.. మృతుల సంఖ్యను 21గా ధృవీకరించారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 77 మంది బౌద్ధ యాత్రికులు ఉన్నారని తెలిపారు. బస్సు సామర్థ్యానికి మించి 25 మంది అదనంగా ప్రయాణించడమే ప్రమాదానికి కారణమై ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. డ్రైవర్ బస్సుపై నియంత్రణ కోల్పోవడంతోనే ఈ ఘటన జరిగిందని స్థానిక పోలీసులు పేర్కొన్నారు. ప్రమాదానికి గురైన బస్సు శ్రీలంక ప్రభుత్వ రవాణా సంస్థకు చెందినదని అధికారులు నిర్ధారించారు. బాధితులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.