ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపిన శ్రీలంక కొత్త ప్రధాని
Sri Lanka new Prime Minister Ranil Wickremesinghe says thanks to PM Modi.తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న
By తోట వంశీ కుమార్ Published on 13 May 2022 12:07 PM ISTతీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో కొత్త ప్రధానిగా ప్రతిపక్ష యూఎన్‌పీ పార్టీ నేత రణిల్ విక్రమసింఘే బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. లంక 26వ ప్రధానిగా 73 ఏళ్ల రణిల్ విక్రమసింఘే చేత గురువారం అధ్యక్షుడు గోటబయ రాజపక్స ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారం అనంతరం నూతన ప్రధాని విక్రమసింఘే మాట్లాడుతూ.. భారత్‌తో సన్నిహిత సంబంధాల కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. భారత ప్రధాని నరేంద్రమోదీకి ధన్యవాదాలు తెలియజేశారు.
ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోయిన లంకను ఆదుకునేందుకు భారత్ 3 బిలియన్ డాలర్లకు పైగా సాయాన్ని వివిధ రూపాల్లో అందించింది. బియ్యం, చమురు వంటి అత్యసరాలను పంపింది. దీని గురించి లంక నూతన ప్రధాని ప్రస్తావిస్తూ.. భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ధన్యవాదాలు తెలిపారు. తన పదవి కాలంలో భారత్‌తో సన్నిహిత సంబంధాల కోసం ఎదురుచేస్తున్నామని తెలిపారు.
తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభంలో అల్లాడుతున్న లంకలో రోజురోజుకు పరిస్థితులు విషమిస్తున్నాయి. ప్రజలు నిరసనలుగా చేపట్టగా.. అవి తీవ్రమై హింసాత్మకంగా మారాయి. దీంతో ప్రధాని పదవికి సోమవారం మహిందా రాజపక్స రాజీనామా చేశారు. దీంతో అధ్యక్షుడు రాజపక్ష.. ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు నేతలతో చర్చించారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన శ్రీలంక ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు, ఆందోళనకారుల నిరసనలకు ముగింపు పలికేందుకు.. ఐదు సార్లు ప్రధానిగా పనిచేసిన రణిల్ విక్రమసింఘే కే ఓటు వేశారు.
కాగా.. కొత్త ప్రధానితో కలిసి పనిచేసేందుకు భారత్ ఎదురుచూస్తోందని కొలంబోలో భారత హైకమిషన్ ఇప్పటికే ఓ ప్రకటనలో తెలిపింది.