విదేశీ మారక నిల్వల కొరత కారణంగా శ్రీలంక కనీవినీ ఎరుగని ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఓ వైపు నిత్యావసర ధరలు, మరోవైపు ఇంధన ధరలు పెరుగుతుండడంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ఇంధన ధరలు రికార్డు స్థాయికి చేరగా మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి ఆయిల్ కంపెనీలు. లీటర్ పెట్రోల్ పై రూ.50, డీజిల్ పై రూ.60 మేర పెంచాయి. దీంతో లంకలో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ.470 కి చేరగా, డీజిల్ ధర రూ.460కి పెరిగింది. పెంచిన ధరలు ఆదివారం మధ్యాహ్నాం రెండు గంటల నుంచి అమల్లోకి రానున్నాయి. గత రెండు నెలల్లో ఇంధన ధరలను ఇలా పెంచడం ఇది మూడవ సారి.
ఇక చివరిసారిగా మే 24న పెట్రోలుపై 24 శాతం, డీజిల్‌పై 38 శాతం ధరలు పెంచారు. ఇంధనాన్ని తీసుకొచ్చే నౌకలు బ్యాంకింగ్‌తో పాటు ఇతర కారణాల వల్ల ఆలస్యంగా వస్తున్నాయని సీపీసీ తెలిపింది. వచ్చేవారం బంకుల్లో పెట్రోల్, డీజిల్ పరిమితంగా ఉంటుందని ప్రజలెవరూ బంకుల వద్ద క్యూ లైన్లు కట్టవద్దని సూచించింది.
తదుపరి ఎగుమతులు వచ్చే వరకు, ప్రస్తుత నిల్వలను ప్రజా రవాణా, విద్యుత్ ఉత్పత్తి మరియు పరిశ్రమలకు మళ్లించడంలో ప్రాధాన్యత ఇవ్వబడుతుందని, వచ్చే వారం మొత్తం పరిమిత ఫిల్లింగ్ స్టేషన్లలో డీజిల్ మరియు పెట్రోల్ పంపిణీ చేస్తామని విద్యుత్ మరియు ఇంధన శాఖ మంత్రి కాంచన విజేశేఖర చెప్పారు. క్రూడాయిల్‌తో తదుపరి నౌక వచ్చే వరకు బంకులను మూసివేస్తున్నామన్నారు.