శ్రీలంకలోని ట్రింకోమలీ నేవల్ బేస్‌లో మాజీ ప్రధాని మహీందా రాజపక్సే, ఆయన కుటుంబ సభ్యులు కొందరు ఆశ్రయం పొందుతున్నారనే సమాచారంతో అక్కడ నిరసనలు చెలరేగాయి. న్యూస్‌వైర్ మీడియా కథనం ప్రకారం.. కొలంబోలోని అధికారిక నివాసం నుండి బయలుదేరిన మాజీ ప్రధాని రాజపక్స, అతని కుటుంబ సభ్యులను నావికా స్థావరంలో ఉంచారు. ట్రింకోమలీ నేవల్ బేస్ లో మాజీ ప్రధాని మహీందా రాజపక్సే, ఆయన కుటుంబ సభ్యులు బస చేశారంటూ నిరసనకారుడు ట్వీట్‌లో పేర్కొన్నాడు.
రాజపక్సేను తొలగించాలని డిమాండ్ చేస్తున్న శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులపై రాజపక్సే మద్దతుదారులు దాడి చేయడంతో శ్రీలంకలో ఘర్షణలు చెలరేగాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం దేశంలో జరిగిన హింసలో ఐదుగురు మరణించారు. దాడి జరిగిన కొన్ని గంటలకే రాజపక్స ప్రధాని పదవికి రాజీనామా చేశారు. దేశంలో హింసాకాండ తీవ్ర రూపం దాల్చడంతో.. హంబన్‌టోటాలోని రాజపక్స కుటుంబం పూర్వీకుల ఇంటికి నిరసనకారులు నిప్పు పెట్టారు. దేశం అత్యంత తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అది ఆహారం, ఇంధనం, విద్యుత్ కొరతకు దారితీసింది.