ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ సీజన్ ను ఎంతో ఆనందంగా జరుపుకుంటూ ఉన్నారు. క్రిస్మస్ సీజన్ పూర్తి స్వింగ్‌లో ఉంది. ఇంటిని అలంకరించడం.. లోపల క్రిస్మస్ చెట్టును పెట్టడం ఆనవాయితీ. క్రిస్మస్ చెట్టు నుండి తమ బహుమతులు, బొమ్మలను పొందాలని ఆశిస్తారు.. కానీ ఒక దక్షిణాఫ్రికా కుటుంబం లైఫ్ లో క్రిస్మస్ చెట్టు అంటే ఈ ఘటనే గుర్తుకు వస్తుంది. ఎందుకంటే ప్రపంచంలోని అత్యంత విషపూరితమైన పాములలో ఒకటి వారి క్రిస్మస్ చెట్టు క్రింద నుండి బయటకు రావడంతో అందరూ ఆశ్చర్య పోయారు.
విషపూరితమైన పామును వదిలించుకోవడానికి కుటుంబం పాములను పట్టే ఒక ప్రొఫెషనల్ ను పిలిపించింది. పామును వదిలించుకోవడానికి నియమించిన వ్యక్తి నిక్ ఎవాన్స్ ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. బయట ఉండాల్సిన పాము తోటమాలి చేసిన పని వలనో.. లేక ఇంటి తలుపు తెరవడం వల్లనో ఇంటిలోపలికి వచ్చేసింది. అది క్రిస్మస్ చెట్టు దగ్గరగా ఉన్న చిన్న షెల్ఫ్‌లోకి వెళ్లిందని అతను ఫేస్‌బుక్‌లో రాశాడు. 2.1 మీటర్ల కంటే పొడవైన పాము అని చెప్పుకొచ్చాడు. ప్రపంచం లోని అత్యంత విషపూరితమైన పాములలో ఈ బ్లాక్ మాంబా కూడా ఒకటని తెలిపాడు.