విమానంలో అనుకోని అతిధి.. గ‌గ్గోలు పెట్టిన ప్ర‌యాణీకులు

Snake on United flight sends passengers into panic.మ‌నం ప్రయాణిస్తున్న వాహ‌నంలో పాము క‌నిపిస్తే ప‌రిస్థితి ఏంటి..?

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 Oct 2022 11:30 AM IST
విమానంలో అనుకోని అతిధి.. గ‌గ్గోలు పెట్టిన ప్ర‌యాణీకులు

మ‌న‌లో చాలా మందికి పాము అంటేనే భ‌యం. పాము ఉంద‌ని తెలిస్తే అటువైపుకు కూడా వెళ్ల‌నివారు ఎంతో మంది. అయితే.. మ‌నం ప్రయాణిస్తున్న వాహ‌నంలో పాము క‌నిపిస్తే ప‌రిస్థితి ఏంటి..? ఒక్క‌సారిగా గుండె ఆగినంత ప‌ని అవుతుంది. స‌రిగ్గా ఇలాంటి అనుభ‌వాన్నే ఎదుర్కొన్నారు ఓ విమాన ప్ర‌యాణీకులు. అదృష్టవ‌శాత్తు ఎవ్వ‌రికి ఏమీ కాక‌పోవ‌డంతో అంద‌రూ ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘ‌ట‌న అమెరికాలోని నివార్క్ లిబ‌ర్టీ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యంలో జ‌రిగింది.

ఫ్లోరిడా రాష్ట్రంలోని టంపా న‌గ‌రం నుంచి యునైటెడ్ 2038 విమానం న్యూజెర్సీకి వ‌చ్చింది. ఫ్లైట్ విమానాశ్ర‌యంలో ల్యాండ్ అయిన స‌మ‌యంలో బిజినెస్ క్లాస్‌లోని ప్ర‌యాణీకులు పామును గుర్తించారు. ఒక్క‌సారిగా అక్క‌డ క‌ల‌క‌లం రేగింది. ప్ర‌యాణీకులు గ‌గ్గోలు పెట్టారు. అప్ర‌మ‌త్త‌మైన విమాన సిబ్బంది వైల్డ్ లైఫ్ ఆప‌రేష‌న్స్ సిబ్బంది, పోర్ట్ అథారిటీ పోలీస్ అధికారుల‌కు స‌మాచారం అందించారు. వారు అక్క‌డ‌కు చేరుకుని పామును ప‌ట్టుకుని అడవిలో వ‌దిలివేశారు.

ఈ పామును గార్డెర్‌ స్నేక్‌గా గుర్తించారు. ఈ పాము విష‌పూరిత‌మైన‌ది కాద‌నీ చెప్పారు. ఇది ఎవ్వ‌రిని కాటువేయ‌ద‌ని, ఉద్దేశ్య‌పూర్వకంగా వేదిస్తేనే కాటు వేస్తాయ‌న్నారు. దీని విషం వ‌ల్ల మాన‌వుల‌కు పెద్ద‌గా అపాయం ఉండ‌ద‌న్నారు.

కాగా.. ఇలాంటి ఘ‌ట‌న‌నే ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో చోటు చేసుకుంది. మ‌లేషియాలోని ఎయిర్ ఏషియా విమానంలో ఫ్లైట్ గాలిలో ఉండ‌గానే పాము క‌నిపించ‌డంతో ప్ర‌యాణీకులు ఆందోళ‌న చెందారు.

Next Story