ఒమిక్రాన్‌ సోకిన బాధితుల్లో స్వల్ప లక్షణాలే కనిపిస్తున్నాయి.. కానీ.!

Slight symptoms are seen in Omicron victims. కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ సోకిన వారిలో స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపిస్తున్నాయని దక్షిణాఫ్రికాకు చెందిన ఓ వైద్యురాలు తెలిపారు.

By అంజి  Published on  29 Nov 2021 8:08 AM GMT
ఒమిక్రాన్‌ సోకిన బాధితుల్లో స్వల్ప లక్షణాలే కనిపిస్తున్నాయి.. కానీ.!

కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ సోకిన వారిలో స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపిస్తున్నాయని దక్షిణాఫ్రికాకు చెందిన ఓ వైద్యురాలు తెలిపారు. ఒమ్రికాన్‌ వెరియంట్‌ సోకిన వారికి ఇంటి దగ్గరే చికిత్స అందించొచ్చన్నారు. ఈ విషయాన్ని దక్షిణాఫ్రికా మెడికల్‌ అసోసియేషన్‌ అధ్యక్షురాలు డాక్టర్‌ ఏంజెలిక్‌ కోయెట్జీ వెల్లడించారు. దక్షిణాఫ్రికా వ్యాక్సిన్‌ కమిటీలో కోయెట్జీ కూడా సభ్యురాలు. ఒమ్రికాన్‌ వేరియంట్‌ను మొదటి దశలో అనుమానించిన వారిలో ఆమె కూడా ఒకరు. డెల్టా వేరియంట్‌ కంటే విభిన్నమైన లక్షణాలతో ఏడుగురు రోగులు వచ్చారని.. వీరికి స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపించినట్లు తెలిపారు. ఈ ఘటన నవంబర్‌ 18వ తేదీన జరిగిందని కోయెట్జీ వివరించారు.

ఒమిక్రాన్‌ వివరాలను నవంబర్‌ 25వ తేదీన దక్షిణాఫ్రికా నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కమ్యూనికేబుల్‌ సంస్థ వెల్లడించింది. ఒమ్రికాన్‌ వేరియంట్‌ సోకిన పేషెంట్లు తీవ్ర శరీర నొప్పులు, తల నొప్పితో రెండు రోజులు బాధపడ్డారని తెలిపారు. వారికి సాధారణ వైరల్‌ ఇన్ఫెక్షన్‌ లక్షణాలు ఉన్నాయని చెప్పారు. కొద్ది రోజులుగా నిత్యం ఇద్దరు లేదా ముగ్గురు కరోనా రోగులు తన క్లినిక్‌ రావడం మొదలైందని, వారిలో స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపించాయని కోయెట్జీ చెప్పారు. ఈ సమయంలో తాను ఏదో మార్పు వచ్చినట్లు గమనించానని, వెంటనే ఎన్‌ఐసీడీని అప్రమత్తం చేశానని తెలిపారు.

మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా కొత్త వేరియంట్‌ను గుర్తించి అంశంపై కీలక ప్రకటన చేసింది. దీనిని కూడా పీసీఆర్‌ పరీక్షల్లో గుర్తించవచ్చని పేర్కొంది. ఒమిక్రాన్‌ వేరియంట్‌ ఇతర పరీక్షల ఫలితాలను ఏ విధంగా ప్రభావితం చేస్తుందనే అంశంపై పరిశోధనలు జరుగుతున్నాయని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. కొత్తి వేరియంట్‌ ఒమ్రికాన్‌ వ్యాప్తి వేగంతో పాటు, రోగి లక్షణాలపై పరిశోధనలు జరుగుతున్నాయని పేర్కొంది. మిగిలిన వేరియంట్లతో పోలిస్తే ఒమిక్రాన్ వేరియంట్‌ ఎంత భిన్నంగా ఉందని చెప్పేందుకు తగిన సమాచారం లేదని చెప్పింది. అయితే గతంలో కరోనా బారిన పడిన వారు కూడా మళ్లీ ఒమ్రికాన్‌ బారిన పడే ఛాన్స్‌ ఉన్నట్లు ఆధారాలు దొరికాయని తెలిపింది.

Next Story