లాస్ ఏంజిల్స్‌లో ఒక సిక్కు వ్యక్తి రోడ్డు మధ్యలో పురాతన యుద్ధ కళ అయిన 'గట్కా' ప్రదర్శిస్తుండగా పోలీసులు అతడిని కాల్చి చంపారు. జూలైలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన ఫుటేజీని లాస్ ఏంజిల్స్ పోలీస్ డిపార్ట్‌మెంట్ (LAPD) ఇటీవల విడుదల చేసింది.
లాస్ ఏంజిల్స్ డౌన్‌టౌన్‌లోని అరీనా సమీపంలో 35 ఏళ్ల గురుప్రీత్ సింగ్ కత్తితో తిరుగుతున్నాడని, ఎంత హెచ్చరించినా కూడా అతడు తాను చేస్తున్న పనిని ఆపడానికి నిరాకరించి పోలీసులపై దాడి చేయడానికి ప్రయత్నించడంతో కాల్చి చంపినట్లుగా పోలీసులు తెలిపారు. గట్కా అనేది పంజాబ్‌లో మూలాలు కలిగిన సాంప్రదాయ యుద్ధ కళ. ఇందులో కత్తులు, ఈటెలు, కవచాలు, కర్రలు వంటి వివిధ ఆయుధాలు ఉంటాయి. దీనిని సాధారణంగా సిక్కు మత, సాంస్కృతిక కార్యక్రమాల సమయంలో ప్రదర్శిస్తారు.
ఈ సంఘటన జూలై 13 ఉదయం జరిగింది. ఒలింపిక్ బౌలేవార్డ్ సమీపంలోని రద్దీగా ఉండే కూడలిలో ఒక వ్యక్తి 2 అడుగుల బ్లేడును ఊపుతూ ప్రయాణీకులపైకి దూసుకెళ్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. LAPD విడుదల చేసిన బాడీక్యామ్ ఫుటేజ్‌లో సిక్కు వ్యక్తి కేవలం ఒక చొక్కా, షార్ట్స్, నీలిరంగు తలపాగా ధరించి రోడ్డు మధ్యలో కత్తిని పట్టుకున్నట్లు చూపిస్తుంది.సంఘటనా స్థలానికి చేరుకున్న తర్వాత, పోలీసు అధికారులు పదే పదే కత్తిని వదిలిపెట్టమని ఆ వ్యక్తికి సూచించారు. అయితే, అతను అందుకు నిరాకరించాడు. కత్తితో అతని నాలుకను కూడా కోసుకున్నాడని ABC7 నివేదిక తెలిపింది.