అగ్రరాజ్యంలో మరోసారి కాల్పులు..ఫ్లోరిడా స్టేట్ వర్సిటీలో ఇద్దరు మృతి
అగ్ర రాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి.
By Knakam Karthik
అగ్రరాజ్యంలో మరోసారి కాల్పులు..ఫ్లోరిడా స్టేట్ వర్సిటీలో ఇద్దరు మృతి
అగ్ర రాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. ఫ్లోరిడాలోని తలహసీలో ఉన్న ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీలో గురువారం జరిగిన కాల్పుల్లో ఇద్దరు మృతి చెందగా.. ఐదుగురు గాయపడ్డారు. గాయపడ్డ వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని తలహసీ మెమోరియల్ హెల్త్‌కేర్ ప్రతినిధి తెలిపారు. కాల్పుల ఘటనతో పోలీసులు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. తలహసీ క్యాంపస్‌లోని స్టూడెంట్ యూనియన్‌లో యాక్టివ్ షూటర్ ఉన్నట్లు మొదట సమాచారం రావడంతో యూనివర్సిటీ వెంటనే అలర్ట్ జారీ చేసింది. విద్యార్థులు, ఫ్యాకల్టీ, సిబ్బంది వెంటనే యూనివర్సిటీని వీడాలని, సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని హెచ్చరించింది.
అనంతరం పోలీసులు, ఇతర ఏజెన్సీలు కాల్పులు చోటుచేసుకున్న ప్రాంతానికి వచ్చి సహాయ చర్యలు చేపట్టాయి. ఈ ఘటనతో క్యాంపస్ లాక్‌డౌన్‌లోకి వెళ్లింది. దీంతో జరగాల్సిన క్లాసులు, స్పోర్ట్స్ ఈవెంట్స్, ఇతర కార్యక్రమాలను రద్దు చేశారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు ఈ విషయాన్ని అధికారులు తెలియజేశారు. ఈ ఘటనపై ట్రంప్ విచారం వ్యక్తం చేశారు. ఇదొక భయంకర సంఘటన అని పేర్కొన్నారు.
కాగా కాల్పులు జరిపిన అనుమాతుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మెయిన్ క్యాంపస్‌లో దాదాపు 42 వేల మంది ఎక్కువ మంది విద్యార్థులు తరగతులకు హాజరవుతున్నారు. దీంతో క్యాంపస్ మొత్తం ఎమర్జెన్సీ వార్నింగ్ జారీ చేశారు. తదుపరి హెచ్చరికలు జారీ చేసే వరకు విద్యార్థులు ఆశ్రయం పొందాలని పోలీసులు సూచించారు. ప్రధాన క్యాంపస్‌లో లేని వారు ఆ ప్రాంతానికి దూరంగానే ఉండాలని అధికారులు కోరారు. అత్యవసర సేవలకు ఫ్లోరిడి స్టేట్ యూనివర్సిటీ పోలీస్ డిపార్ట్‌మెంట్‌ను సంప్రదించాలని ఆదేశించారు.