నీరవ్ మోడీకి లండన్ కోర్టులో చుక్కెదురు..!

వేల కోట్ల రూపాయల పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు, పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీకి లండన్ కోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది

By -  Knakam Karthik
Published on : 26 March 2026 10:40 AM IST

International News, Nirav Modi, PNB Scam, CBI, UK High Court, Extradition, Financial Fraud, BankingScam

నీరవ్ మోడీకి లండన్ కోర్టులో చుక్కెదురు..భారత్‌కు అప్పగింతపై పిటిషన్ తిరస్కరణ

వేల కోట్ల రూపాయల పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు, పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీకి లండన్ కోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. తనను భారతదేశానికి అప్పగించాలన్న ఉత్తర్వులను సవాలు చేస్తూ, విచారణను తిరిగి ప్రారంభించాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను లండన్‌లోని కింగ్స్ బెంచ్ డివిజన్ హైకోర్టు తిరస్కరించింది. రక్షణ మధ్యవర్తి సంజయ్ భండారి కేసులో వెలువడిన తీర్పును సాకుగా చూపుతూ, తనను భారత్‌కు అప్పగిస్తే చిత్రహింసలకు గురయ్యే ప్రమాదం ఉందని నీరవ్ మోడీ వాదించారు. అయితే, ఈ వాదనను సీబీఐ (CBI) ప్రతినిధులు కోర్టులో సమర్థవంతంగా తిప్పికొట్టారు. కేసును పునఃసమీక్షించేందుకు అవసరమైన బలమైన కారణాలు లేదా అసాధారణ పరిస్థితులు నీరవ్ మోడీ పిటిషన్‌లో లేవని ధర్మాసనం స్పష్టం చేస్తూ, పాత తీర్పును మార్చాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పింది.

పంజాబ్ నేషనల్ బ్యాంక్ పేరిట నకిలీ గ్యారంటీ పత్రాలను సృష్టించి విదేశీ రుణాలు పొందడం ద్వారా భారీ ఆర్థిక మోసానికి పాల్పడినట్లు నీరవ్ మోడీపై ఆరోపణలు ఉన్నాయి. 2018 జనవరిలో సీబీఐ దర్యాప్తు ప్రారంభం కావడానికి ముందే ఆయన దేశం దాటి వెళ్లిపోగా, 2019లో యూకేలో అరెస్టయ్యారు. అప్పటి నుండి ఆయనను భారతదేశానికి రప్పించేందుకు భారత దర్యాప్తు సంస్థలు చట్టపరమైన పోరాటం సాగిస్తున్నాయి. ఇప్పటికే బ్రిటిష్ న్యాయస్థానాలు ఆయన అప్పగింతకు ఆమోదం తెలిపాయి. భారత జైళ్లలో ఆయనకు కల్పించే సౌకర్యాలు మరియు మానవ హక్కుల రక్షణకు సంబంధించి భారత ప్రభుత్వం ఇచ్చిన హామీలపై కోర్టు సంతృప్తి వ్యక్తం చేసింది. తాజాగా ఆయన దాఖలు చేసిన పిటిషన్ కూడా వీగిపోవడంతో, నీరవ్ మోడీని భారత్‌కు తీసుకొచ్చే ప్రక్రియలో మరో కీలక అడ్డంకి తొలగిపోయినట్లయింది.

ఈ కేసును క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ న్యాయవాదులు వాదించగా, వారికి సహాయం చేయడానికి భారతదేశం నుండి సీబీఐ ప్రత్యేక బృందం లండన్ వెళ్ళింది. గతంలో నీరవ్ మోడీ దాఖలు చేసిన పలు అప్పీళ్లను కూడా యూకే కోర్టులు కొట్టివేసిన సంగతి తెలిసిందే. తాజా పరిణామంతో ఆయన అప్పగింత ప్రక్రియ మరింత వేగవంతం కానుంది. బ్యాంకులను మోసం చేసి విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరగాళ్లను రప్పించే ప్రయత్నాల్లో భారత ప్రభుత్వానికి ఇది ఒక పెద్ద విజయంగా భావించవచ్చు.

Next Story