గ్లోబల్ వార్మింగ్ కారణంగా వాతావరణంలో మార్పులు సంభవించాయి. దీని కారణంగా ఉత్తరార్ధగోళంలో గడ్డకట్టిన మంచు వేగంగా కరుగుతోంది. ఇదే ఇప్పుడు మానవులకు కొత్త ముప్పు తెచ్చేలా కనిపిస్తోంది. తాజాగా శాస్త్రవేత్తలు 48,500 సంవత్సరాల నాటి జాంబీ వైరస్‌ను గుర్తించారు. ఆ వైరస్ ఇప్పటి వరకు మంచు కింద లాక్ చేయబడింది. ఇది అంటువ్యాధి అయ్యే అవకాశం ఉన్నందున మరొక మహమ్మారి భయాలను రేకెత్తిస్తోంది. యూరోపియన్ పరిశోధకులు రష్యాలోని సైబీరియా ప్రాంతంలో శాశ్వత మంచు నుండి సేకరించిన పురాతన నమూనాలను పరిశీలించారు.
అందులో 48,500 ఏళ్ల నాటి జాంబీ వైరస్‌ను శాస్త్రవేత్తలు బయటకు తీయడం ఆందోళణకు కారణం అవుతోంది. ఇప్పుడిప్పుడే కరోనా నుంచి కోలుకుంటున్న ప్రపంచ దేశాలకు ఇది మరో పిడుగు లాంటి వార్త అయ్యింది. ఈ వైరస్ అంటు వ్యాధిగా ప్రబలితే కరోనా కంటే పెద్ద మహమ్మారిగా మరే ఛాన్స్ ఉందని నిపుణులు చెబుతున్నారు. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. "జాంబీ వైరస్‌లు" అని పిలిచే 13 కొత్త వ్యాధికారకాలను శాస్త్రవేత్తలు గుర్తించి వాటిని వర్గీకరించారు. ఒక్కో వైరస్ ఒక్కో జీనోమ్ కలిగి ఉందన్నారు.
గడ్డకట్టిన సరస్సు లోపల అనేక ఏళ్లుగా చిక్కుకున్న ఆర్గానిక్ పదార్థాలు బయటపడే ఛాన్స్ ఉంది. అందులో ప్రాణాంతక బ్యాక్టీరియాలు కూడా ఉండొచ్చని అంటున్నారు. తాజాగా శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లో పండోరవైరస్ యెడోమా అని పిలవబడే పురాతనమైన వైరస్‌ను గుర్తించారు. ఇది 48,500 సంవత్సరాల నాటిదని తెలిసింది. ఇది 2013లో ఇదే పరిశోధన బృందం కనిపెట్టిన 30,000 సంవత్సరాల పురాతన వైరస్ కలిగి ఉన్న మునుపటి రికార్డును బద్దలు కొట్టింది. జాంబీ వైరస్ అంటు వ్యాధిగా ప్రబలే అవకాశం ఉందని, ఇది ప్రపంచానికి మరో ప్రమాద సంకేతమని పరిశోధకులు హెచ్చరించారు.