సౌదీ అరేబియా అధికారికంగా 'మిస్ యూనివర్స్' పోటీలో భాగమైంది. ఇస్లామిక్ దేశం తరపున మొట్టమొదటి ప్రతినిధిగా రూమీ అల్ఖహ్తానీ చరిత్ర సృష్టించింది. క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ అల్ సౌద్ ఆధ్వర్యంలో ఎన్నో మార్పులకు శ్రీకారం చుడుతున్న సౌదీ అరేబియా మరో అడుగు ముందుకు వేసింది. 27 ఏళ్ల మోడల్ అయిన రూమీ అల్ఖహ్తానీ సోమవారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో అంతర్జాతీయ అందాల పోటీలో దేశం నుండి పాల్గొనే మొదటి మహిళ తానే అని తెలియజేశారు. మిస్ యూనివర్స్ పోటీలో సౌదీ అరేబియా పాల్గొనడం ఇదే తొలిసారని రూమీ ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపారు.
సౌదీ అరేబియా రాజధాని రియాద్‌కు చెందిన అల్ఖహ్తానీ కొన్ని వారాల క్రితం మలేషియాలో జరిగిన మిస్ అండ్ మిసెస్ గ్లోబల్ ఆసియన్‌లో ఇటీవల పాల్గొంది. "ప్రపంచ సంస్కృతుల గురించి తెలుసుకోవడం.. సౌదీ సంస్కృతి మరియు వారసత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని అనుకుంటున్నాను" అని అరబ్ న్యూస్ కు రూమీ అల్ఖహ్తానీ తెలిపారు. మిస్ సౌదీ అరేబియా కిరీటంతో పాటు, ఆమె మిస్ మిడిల్ ఈస్ట్ (సౌదీ అరేబియా), మిస్ అరబ్ వరల్డ్ పీస్ 2021, మిస్ ఉమెన్ (సౌదీ అరేబియా) టైటిళ్లను రూమీ ఇప్పటికే సొంతం చేసుకుంది.