శాటిలైట్ చిత్రాలు చూస్తే తెలిసిపోతుంది.. విధ్వంసం ఏ స్థాయిలో ఉందో
Satellite Pics Show Scale Of Destruction After Massive Turkey Earthquake.ప్రకృతి కన్నెర జేయడంతో తుర్కియే, సిరియాలు
By తోట వంశీ కుమార్ Published on 9 Feb 2023 6:52 AM GMTప్రకృతి కన్నెర జేయడంతో తుర్కియే, సిరియాలు కకావికలం అయ్యాయి. భారీ భూకంపం కారణంగా ఎటు చూసినా శిథిలాల గుట్టలు, శవాల దిబ్బలే కనిపిస్తున్నాయి. గంటలు గడుస్తున్నా కొద్ది మృతదేహాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు 15 వేల మందికి పైగా మరణించినట్లు అధికారులు అధికారికంగా ప్రకటించారు. ఒక్క తుర్కియేలోనే 12,391 మంది ప్రాణాలు కోల్పోయారు. వేల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు.
భూకంపం ముందు తరువాత తీసిన ఉపగ్రహ చిత్రాలు అక్కడి పరిస్థితికి అద్దం పడుతున్నాయి. దక్షిణ నగరం అంటాక్యా, కహ్రమన్మరాస్ అత్యంత ప్రభావితమైన ప్రాంతాలలో ఉన్నాయి. అనేక ఎత్తైన భవనాలు కూలిపోయినట్లు చాలా స్పష్టంగా కనిపిస్తుండడంతో పాటు ఎటు చూసినా శిథిలాల గుట్టలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా బహిరంగ ప్రదేశాలు, స్టేడియాల్లో సహాయక చర్యల కోసం ఏర్పాటు చేసిన శిబిరాల్లో వందలాది ఆశ్రయం పొందుతున్నట్లు కూడా ఈ చిత్రాల్లో కనిపిస్తోంది.
భూకంపం కారణంగా 23 మిలియన్ల మంది ప్రజలు ప్రభావితమవుతారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) తెలిపింది. ప్రభావిత ప్రాంతాల్లో 77 జాతీయ, 13 అంతర్జాతీయ అత్యవసర వైద్య బృందాలను మోహరిస్తున్నట్లు తెలిపింది.
భూకంపం కారణంగా ఎక్కువగా నష్టపోయింది తుర్కియేనే. దాదాపు 10 ప్రావిన్స్‌లు నామరూపాల్లేకుండా మారిపోయాయి. ఇక్కడ ధ్వంసమైన భవనాల సంఖ్య 6000 వేలకు పైనే ఉంటుందని అంచనా. ఒక్కో భవన శిథిలాల కింద దాదాపు 400 నుంచి 500 మంది చిక్కుకుపోగా వారిని రక్షించేందుకు ఆ సమయంలో కనీసం 10 మంది సహాయక సిబ్బంది కూడా అందుబాటులో లేరు. శిథిలాలను తొలగించేందుకు సరైన యంత్రాలు లేకపోవడంతో తుర్కియే అధ్యక్షుడు రెసెస్ తయ్యిప్ ఎర్డోగాన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
ఇక విమానాశ్రయాలు, కీలక నౌకాశ్రయాలు కూడా దెబ్బతినడంతో ప్రపంచ దేశాల సాయం అక్కడకు చేరడం కష్టతరంగా మారింది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు అత్యంత విలువైన 72 కాలం కరిగిపోయింది. దీంతో మృతుల సంఖ్య భారీగా పెరిగిపోతుందనే భయాలు నెలకొన్నాయి.