భారత వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్న బంగ్లాదేశ్ నాయకులపై భారత విదేశాంగ మంత్రి జై శంకర్ వార్నింగ్ ఇచ్చారు. భారతదేశమే అన్ని విషయాలకు కారణమంటూ బంగ్లాదేశ్ ఆరోపించడం మానుకోవాలని సూచించారు. మస్కట్‌లో బంగ్లాదేశ్ విదేశాంగ సలహాదారు తౌహిద్ హుస్సేన్‌తో జైశంకర్ భేటీ అయ్యారు. ఆ సమయంలోనే ఆయన పద్ధతి మార్చుకోవాలంటూ చెప్పారు. 1971 నుంచి బంగ్లాదేశ్‌తో మంచి సంబంధాలు ఉన్నాయని, ఇటీవల అక్కడి మధ్యంతర ప్రభుత్వ నాయకులు ప్రతిదానికి భారత్‌ను నిందిస్తున్నారని జై శంకర్ చెప్పుకొచ్చారు. భారత్ బంగ్లాతో మంచి సంబంధాలు కోరుకుంటోందని, కానీ ఢిల్లీతో ఎలాంటి సంబంధాలు కావాలనుకుంటున్నారో వారే నిర్ణయించుకోవాలని జైశంకర్ చెప్పారు.
బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా చోటుచేసుకున్న ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలో 2024 ఆగస్టు 5న ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనాపదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు. మహమ్మద్ యూనస్ నేతృత్వంలో బంగ్లాలో తాత్కాలిక ప్రభుత్వం వచ్చాక కూడా అక్కడ ఆందోళనలు తగ్గుముఖం పట్టలేదు. ఇక అక్కడి హిందువులపై జరిగిన దాడులను భారత్ తీవ్రంగా తప్పుబట్టింది.