సిరియాలో రష్యా వైమానిక దాడి.. 200 మంది ఉగ్ర‌వాదులు హ‌తం

Russian airstrikes on Syria.సిరియాలో మరోసారి దాడులు జరిగాయి. ఉగ్రవాదులపై రష్యా బలగాలు విరుచుకుపడ్డాయి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 April 2021 2:34 AM GMT
Russia air strikes

నిరంతరం బాంబులతో దద్దరిల్లే సిరియాలో మరోసారి దాడులు జరిగాయి. ఉగ్రవాదులపై రష్యా బలగాలు విరుచుకుపడ్డాయి. ఉగ్రవాద శిక్షణ క్యాంపుపై రష్యా యుద్ధ విమానాలు చేసిన దాడులలో సుమారు 200 మంది ఉగ్రవాదులు చనిపోయారని రష్యా సైన్యం ప్రకటించింది. ఉగ్రవాదులకు చెందిన 24 వాహనాలు కూడా ధ్వంసమయ్యాయని పేర్కొంది.

సిరియాలో ఎప్పుడూ కల్లోలమే కన్పిస్తుంది. నిత్యం బాంబు దాడులతో ఆ దేశం తల్లడిల్లు తుంటుంది. గత కొన్నేళ్లుగా ఉగ్రవాదులు సామాన్యులపై చేసే దాడుల నేపధ్యంలో సిరియా పేరు ప్రముఖంగా విన్పించేది. ఈసారి సిరియాలోని ఉగ్రవాదులపైనే దాడులు జరిగాయి. సిరియాలోని ఉగ్రవాద స్థావరాలపై రష్యా సర్జికల్ స్ట్రైక్ జరిపింది. ఈ దాడుల్లో 2 వందల మంది ఉగ్రవాదులు హతమయ్యారని, 24 వాహనాలు, 5 వందల కిలోల మందుగుండు సామగ్రి, పేలుడు పదార్ధాల్ని ధ్వంసం చేశామని రష్యా సైన్యం ప్రకటించింది.

పల్మైరా ప్రాంతంలో ఉన్న క్యాంపులో ఉగ్రవాదులు పేలుడు పదార్ధాల తయారీలో శిక్షణ పొందుతున్నట్టు తెలుసుకున్న రష్యా సైన్యం ఈ మేరకు సర్జికల్ స్ట్రైక్స్ జరిపినట్టుగా తెలుస్తోంది. రష్యా సైన్యం 2015 నుంచి సిరియాలో సైనిక చర్యలను నిర్వహిస్తోంది. సిరియా అధ్యక్షుడు అసద్ బాషర్ కు మద్దతుగా పని చేస్తోంది. ఇటీవల ఇద్దరు రష్యన్ సైనికుల్ని చంపినట్టు ఇస్లామిక్ స్టేట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రతీకార చర్యల్లో భాగంగానే రష్యా ఈ విధమైన వైమానిక దాడులు చేసింది. అయితే ఇస్లామిక్ స్టేట్ రష్యా జరిపిన సర్జికల్ స్ట్రైక్స్‌ను ఇంకా ధృవీకరించలేదు.


Next Story