అతిపెద్ద అణువిద్యుత్ కేంద్రం జాపోరిషియా పై ర‌ష్యా దాడి

Russia attacks Ukraine nuclear plant.ఉక్రెయిన్‌పై ర‌ష్యా ప్రారంభించిన యుద్దం తొమ్మిదో రోజుకు చేరుకుంది. ర‌ష్యా వైమానిక

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 March 2022 5:32 AM GMT
అతిపెద్ద అణువిద్యుత్ కేంద్రం జాపోరిషియా పై ర‌ష్యా దాడి

ఉక్రెయిన్‌పై ర‌ష్యా ప్రారంభించిన యుద్దం తొమ్మిదో రోజుకు చేరుకుంది. ర‌ష్యా వైమానిక దాడుల‌తో విరుచుకుప‌డుతుండ‌గా.. ఉక్రెయిన్ సైన్యం కూడా ధీటుగా తిప్పికొడుతోంది. యుద్ధం కార‌ణంగా ఇరు దేశాల‌కు చెందిన ప‌లువురు సైనికుల‌తో పాటు చాలా మంది ఉక్రెయిన్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఇదిలా ఉంటే.. ఎన‌ర్హోద‌ర్ న‌గ‌రంలో యూర‌ప్‌లోనే అతి పెద్ద అణు విద్యుత్ కేంద్రం జాపోరిషియా ఉంది. ఉక్రెయిన్‌కు దాదాపు 40 శాతం అణు విద్యుత్‌ ఈ స్టేషన్‌ నుంచే సరఫరా అవుతోంది.

భార‌త కాల‌మాన ప్ర‌కారం గురువారం అర్థ‌రాత్రి దాటాక ర‌ష్యా ద‌ళాలు ఈ ప్లాంట్‌పై రాకెట్ లాంచ‌ర్ల‌తో దాడి చేశాయి. దీంతో అణువిద్యుత్ కేంద్రం వ‌ద్ద పెద్ద ఎత్తున మంట‌లు చెల‌రేగడంతో పాటు దట్ట‌మైన పొగ అలుముకుంద‌ని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్ర కులేబా తెలిపారు. ఈ అణువిద్యుత్ కేంద్రం రియాక్ట‌ర్ పేలితే చెర్నోబిల్ పేలుడు కంటే దాదాపు ప‌ది రెట్లు భారీ న‌ష్టం ఉంటుంద‌ని ఆయ‌న ట్వీట్ చేశారు. ర‌ష్యా వెంట‌నే దాడుల‌ని ఆపివేయాల‌ని, అగ్నిమాప‌క సిబ్బందిని అనుమ‌తించాల‌న్నారు.

కాగా.. అణు విద్యుత్ కేంద్రంలో అత్య‌వ‌స‌ర ప‌రిక‌రాలకు ఎలాంటి ప్ర‌మాదం వాటిల్లలేద‌ని ప్లాంటు సుర‌క్షితంగానే ఉంద‌ని డైరెక్ట‌ర్ చెప్పారు. మంట‌లు అదుపులోకి వ‌చ్చాయ‌ని..దీంతో పెనుప్ర‌మాదం త‌ప్పింద‌న్నారు. ఈ ఘ‌ట‌న‌లో ఎటువంటి ప్రాణ న‌ష్టం చోటుచేసుకోలేద‌ని చోటుచేసుకోలేద‌న్నారు.

ఉక్రెయిన్ అధ్య‌క్షుడికి యూకే ప్ర‌ధాని ఫోన్‌..

జాపోరిషియా అణువిద్యుత్ కేంద్రంపై ర‌ష్యా చేసిన దాడితో ఐరోపా ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డింది. ఈ నేప‌థ్యంలో ఉక్రెయిన్ అధ్య‌క్షుడి జెలెన్‌స్కీకి యూకే ప్ర‌ధాని బోరిస్ జాన్స‌న్ ఫోన్ చేసి మాట్లాడారు. పుతిన్ నిర్ల‌క్ష్య చ‌ర్య‌లు ఐరోపా భ‌ద్ర‌త‌కు ముప్పుగా మారుతున్నాయ‌ని యూకే ప్ర‌ధాని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

Next Story