రిషి సునాక్.. బ్రిటన్ రాజకీయాల్లో సరికొత్త చరిత్ర సృష్టించారు. ప్రధాని పదవికి పోటీలో ఉన్న పెన్నీమోర్డాన్ రేసు నుంచి తప్పుకున్నట్లు వెల్లడించడంతో రిషి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో తొలిసారి ఓ భారత సంతతి వ్యక్తి బ్రిటన్ ప్రధాని పీఠాన్ని అధిష్టించనున్నారు. రిషి సునాక్‌కు 193 మంది ఎంపీల మద్దతు ఉండగా మోర్డాన్‌కు 27 మంది ఎంపీ ల మద్దతు ఉంది.
బ్రిటన్ దేశంలో ఆర్థిక సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో ప్రధాని పదవికి లిజ్ ట్రస్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. నెలన్నర రోజుల క్రితం లిజ్ ట్రస్‌చేతిలో ఓటమిపాలైన సునాక్.. నేడు ఆ దేశ ప్రధానిగా ఎన్నికయ్యారు. త్వరలోనే రిషి సునాక్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు.
42 ఏళ్ల రిషి సునాక్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కన్జర్వేటివ్ పార్టీ నాయకుడిగా ఎన్నుకున్న పార్టీ ఎంపీలు, నేతలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తాను ఎంతగానో ప్రేమించే పార్టీకి, దేశానికి సేవ చేసేందుకు తన జీవితంలో లభించిన అతిపెద్ద గౌరవం ఇది అని అన్నారు. యూకే గొప్ప దేశం అని చెప్పారు. అయితే.. ప్రస్తుతం దేశం తీవ్ర ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటుందన్నారు.
మనకు స్థిరత్వం, ఐక్యత కావాలన్నారు. పార్టీని, దేశాన్ని ఏకతాటిపైకి తీసుకురావడానికి తాను అత్యంత ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. ప్రస్తుత సవాళ్లను అధిగమించడానికి, మన భవిష్యత్తు తరాలను గొప్పగా నిర్మించడానికి ఇదే ఏకైక మార్గం అని తెలిపారు. చిత్తశుద్ధితో, అణుకువతో మీకు సేవ చేస్తానని హామీ ఇస్తున్నాను. బ్రిటీష్ ప్రజలకు అనునిత్యం సేవ చేస్తాను అని రిషి సునాక్ అన్నారు.