దిగివచ్చిన రష్యా అధ్యక్షుడు.. ఉక్రెయిన్‌తో చర్చలకు రెడీ.!

Putin ready for talks with Ukraine. ఉక్రెయిన్‌ - రష్యా దేశాల భీకర దాడులు జరుగుతున్న వేళ.. రష్యా అధ్యక్షుడి కార్యాలయం నుండి కీలక ప్రకటన వచ్చింది.

By అంజి  Published on  25 Feb 2022 7:40 PM IST
దిగివచ్చిన రష్యా అధ్యక్షుడు.. ఉక్రెయిన్‌తో చర్చలకు రెడీ.!

ఉక్రెయిన్‌ - రష్యా దేశాల భీకర దాడులు జరుగుతున్న వేళ.. రష్యా అధ్యక్షుడి కార్యాలయం నుండి కీలక ప్రకటన వచ్చింది. రష్యా మీడియా స్పుత్నిక్ ప్రకారం.. ఉక్రెయిన్‌తో చర్చల కోసం బెలారస్‌కు ప్రతినిధి బృందాన్ని పంపడానికి అధ్యక్షుడు వ్లాదమిర్ పుతిన్ సిద్ధంగా ఉన్నారు. అంతకుముందు, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌తో జరిగిన సంభాషణలో పుతిన్ ఉక్రెయిన్‌తో ఉన్నత స్థాయి చర్చలు జరపాలనే రష్యా కోరికను పునరుద్ఘాటించారు. ఉక్రెయిన్‌ అధికార బృందంతో చర్చలు జరిపేందుకు తమ బృందాన్ని బెలారస్‌ రాజధాని మిన్‌స్క్‌కు పంపిస్తామని తెలిపింది. ఉక్రెయిన్‌ ఆర్మీ ఆయుధాలు వీడితే చర్చలకు సిద్ధమేనంటూ ఇప్పటికే రష్యా విదేశాంగ శాఖ మంత్రి ప్రకటించిన సంగతి తెలిసిందే.

అయితే చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌తో పుతిన్‌ సంభాషించిన కొన్ని గంటల తర్వాత రష్యా అధ్యక్షుడి కార్యాలయం నుండి ఈ ప్రకటన వెలువడటం గమనార్హం. ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. కొనసాగుతున్న ఘర్షణలో ఇప్పటివరకు 1,000 మందికి పైగా రష్యన్ సైనికులు మరణించారు. మరోవైపు ఉక్రేనియన్ రాజధానిపై క్రెమ్లిన్ బలగాలు అణచివేస్తున్నందున, కీవ్‌ వెలుపల ఉన్న విమానాశ్రయాన్ని తాము తమ ఆధీనంలోకి తీసుకున్నామని రష్యా సైన్యం పేర్కొంది. రష్యా తన సైనిక చర్యను కొనసాగిస్తున్న నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను చర్చల కోసం ఆహ్వానించారు.

Next Story