ఉక్రెయిన్‌పై రష్యా మిలిటరీ ఆపరేషన్
Putin announces a military operation in the Donbas region of Ukraine.ఉక్రెయిన్, రష్యా మధ్య వివాదం పతాక స్థాయికి
By తోట వంశీ కుమార్ Published on 24 Feb 2022 10:12 AM ISTఉక్రెయిన్, రష్యా మధ్య వివాదం పతాక స్థాయికి చేరింది. ఉక్రెయిన్‌పై రష్యా మిలిటరీ ఆపరేషన్ చేపట్టింది. ఈ విషయాన్ని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. ఉక్రెయిన్ సైన్యం ఆయుధాలను విడనాడాలని, వేర్పాటు వాదులు లొంగిపోవాలని సూచించారు. అంతేకాదు.. ఉక్రెయిన్ విషయంలో ఎవరూ జ్యోకం చేసుకోవద్దని హెచ్చరించారు. ఈ విషయంలో ఎవరైనా జోక్యం చేసుకుంటే తీవ్ర పర్యవసానాలు ఉంటాయని తెలిపారు.
గురువారం ఉదయం పుతిన్ జాతినుద్దేశించి ప్రసంగించారు. తూర్పు ఉక్రెయిన్‌లో సైనిక చర్యను చేపట్టినట్లు తెలిపారు. వేర్పాటువాద ప్రాంతాల్లో పౌరులను రక్షించడానికి ఇలా చేయడం తప్పలేదన్నారు. రక్తం పాతం జరిగితే దానికి ఉక్రెయిన్ పాలకులే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌ను ఆక్రమించాలనే ఉద్దేశం తమకు లేదని చెప్పుకొచ్చారు. ఈ విషయంలో ఎవరూ జోక్యం చేసుకోవద్దని సూచించారు. ఈ ఆపరేషన్‌లో జోక్యం చేసుకునేవారిపై ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు.
ఇదిలా ఉంటే.. ఉక్రెయిన్ ప్రభుత్వం ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఎమర్జెన్సీని ప్రకటించింది. పలు ప్రాంతాల్లో బాంబుల వర్షం కురుస్తుండడంతో ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కొవాలన్న అంశాలపై ఆలోచనలో పడింది. కాగా.. ఉక్రెయిన్‌లోని రెండు వేర్పాటు వాద ప్రాంతాలకు పుతిన్ స్వతంత్ర హోదా కల్పించారు. ఆ ప్రాంతాలకు రష్యా మిలిటరీ సహాకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే రష్యాపై అమెరికా, జర్మనీ, బ్రిటన్ సహా పలు దేశాలు ఆర్థికపరమైన ఆంక్షలు విధించాయి. అయినప్పటికి ఏ మాత్రం వెనక్కి తగ్గిన రష్యా.. నేడు మిలిటరీ ఆపరేషన్ చేపట్టింది.