అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఎప్పుడు సౌమ్యంగానే ఉంటారు. అయితే.. బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన సహనం కోల్పోయాడు. ఓ రిపోర్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో తొలి శిఖరాగ్ర సమావేశం ముగిసిన అనంతరం మీడియాతో జరిగిన సమావేశంలో ఈ ఘటన జరిగింది. అయితే.. అనంతరం సదరు రిపోర్టకు ఆయన క్షమాపణలు కూడా చెప్పాడు.
పుతిన్‌తో సమావేశం అనంతరం జో బైడెన్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా.. పుతిన్ తన ప్రవర్తను మార్చుకుంటారని మీరు విశ్వసిస్తున్నారా..? అని సీఎన్ఎన్ వైట్‌హౌజ్ కరెస్పాండెంట్ కైట్లాన్ కొలిన్స్ పదే పదే ఈ ప్రశ్నను అడిగాడు. దీంతో సహనం కోల్పోయిన అమెరికా అధ్యక్షడు జో బైడెన్ సీరియస్ అయ్యారు. అతను తన ప్రవర్తన మార్చుకుంటాడని నాకు నమ్మకం లేదు. అయినా నేను నమ్మకంగా ఉన్నానని ఎప్పుడు చెప్పాను..? నాకు దేనిపైనా నమ్మకం లేదు. ఒక వాస్తవాన్ని చెబుతున్నాను. అది మీకు అర్థం కాకపోతే నేనేమీ చేయలేనని ' అసహనం వ్యక్తం చేశారు. అయితే ఆ తర్వాత జెనీవా నుంచి వాషింగ్టన్‌కు తిరిగొచ్చే ముందు ఎయిర్‌ఫోర్స్ ఎక్కే సమయంలో మరోసారి రిపోర్టర్లతో మాట్లాడిన బైడెన్.. సదరు రిపోర్టర్‌కు క్షమాపణ చెప్పారు.