కొత్త చట్టం.. పెళ్లికి ముందు శృంగారం నేరం.. ఏడాది జైలు శిక్ష
పెళ్లికి ముందు లివింగ్ ఇన్ రిలేషన్ షిప్, శృంగారం నేరంగా పరిగణించే చట్టం ఇండోనేషియాలో అమల్లోకి వచ్చింది.
By - అంజి |
కొత్త చట్టం.. పెళ్లికి ముందు శృంగారం నేరం.. ఏడాది జైలు శిక్ష
పెళ్లికి ముందు లివింగ్ ఇన్ రిలేషన్ షిప్, శృంగారం నేరంగా పరిగణించే చట్టం ఇండోనేషియాలో అమల్లోకి వచ్చింది. 2023లోనే అక్కడి అధ్యక్షుడు ఈ బిల్లుకు ఆమోదం తెలపగా.. తాజాగా చట్టరూపం దాల్చింది. పెళ్లికి ముందు సహజీవనానికి ఆరు నెలలు, పెళ్లికి ముందు శృంగారం చేసిన నేరానికి ఏడాది జైలు శిక్ష విధిస్తారు. అయితే, ఇది వ్యక్తుల ప్రైవసీని ఉల్లంఘించడమేనంటూ ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది.
ఇండోనేషియా శుక్రవారం తన కొత్తగా ఆమోదించబడిన శిక్షాస్మృతిని అమలు చేయడం ప్రారంభించింది. 80 సంవత్సరాలకు పైగా దేశాన్ని పరిపాలించిన డచ్ కాలం నాటి క్రిమినల్ చట్టాన్ని ఈ శిక్షాస్మృతి భర్తీ చేసింది. ఇండోనేషియా చట్టపరమైన భూభాగంలో ఇది ఒక పెద్ద మార్పును సూచిస్తుంది. 1945లో స్వాతంత్ర్యం ప్రకటించినప్పటి నుండి, ఆగ్నేయాసియా దేశం వలసరాజ్యాల చట్రం కింద పనిచేస్తూ వచ్చింది. ఇప్పుడు తాజాగా కొత్త పీనల్ కోడ్ అమల్లోకి వచ్చింది.
ఈ కొత్త పీనల్ కోడ్‌లోని ఆర్టికల్ 411 ప్రకారం.. వివాహం కాకుండా శృంగారంలో పాల్గొంటే గరిష్టంగా ఏడాది పాటు జైలు శిక్ష లేదా భారీ జరిమానా విధిస్తారు. అయితే ఇందులో ఒక కీలక నిబంధన ఉంది. కేవలం బాధితుల జీవిత భాగస్వామి, తల్లిదండ్రులు లేదా పిల్లలు ఫిర్యాదు చేస్తేనే పోలీసులు కేసు నమోదు చేస్తారు. మూడవ వ్యక్తులు లేదా అపరిచితులు చేసే ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకోరు. ఈ చట్టం కేవలం ఇండోనేషియా పౌరులకే కాకుండా.. అక్కడికి వెళ్లే విదేశీ పర్యాటకులకు కూడా వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.