అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. గురువారం నాడు ఒక ఆఫ్-డ్యూటీ పోలీసు అధికారితో సహా ఐదుగురు వ్యక్తులు కాల్చి చంపబడ్డారు. ఈ ఘటన నార్త్ కరోలినా రాజధాని రాలీగ్‌లోని నివాస ప్రాంతంలో జరిగింది. న్యూస్ రివర్ గ్రీన్‌వే సమీపంలో తెల్లజాతీయుడైన ఓ టీనేజీ యువకుడు తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. దీంతో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, పలువురికి తీవ్రగాయాలయ్యాయి. ఒక పోలీసు అధికారితో సహా కనీసం ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారని మేయర్ మేరీ-ఆన్ బాల్డ్విన్ అన్నారు.
క్షతగాత్రులను సమీపంలోని వేక్‌మెడ్ ఆస్పత్రికి తరలించామని అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే ఛాన్స్ ఉందని తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు మేయర్ మేరీ-ఆన్ బాల్డ్విన్‌కు తెలిపారు. గురువారం నివాస పరిసరాల్లో కనీసం నలుగురిని కాల్చి గాయపరిచిన తర్వాత ఒక అనుమానితుడిని అరెస్టు చేసినట్లు నార్త్ కరోలినా అధికారులు తెలిపారు. నార్త్ కరోలినా గవర్నర్ రాయ్ కూపర్ మాట్లాడుతూ.. తాను బాల్డ్‌విన్‌తో మాట్లాడానని, ఘటనా స్థలంలో సహాయానికి సిబ్బందిని మోహరిస్తున్నానని చెప్పారు.