జీ-20 స‌ద‌స్సులో ప్ర‌ధాని మోదీ కీల‌క ప్ర‌సంగం.. కొత్త ప్ర‌పంచాన్ని సృష్టించుకుందామ‌ని పిలుపు

PM Modi speech at G20 Summit.ఇండోనేషియాలోని బాలిలో పదిహేడవ జీ-20 సదస్సు మంగ‌ళ‌వారం ప్రారంభ‌మైంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  15 Nov 2022 12:35 PM IST
జీ-20 స‌ద‌స్సులో ప్ర‌ధాని మోదీ కీల‌క ప్ర‌సంగం.. కొత్త ప్ర‌పంచాన్ని సృష్టించుకుందామ‌ని పిలుపు

ఇండోనేషియాలోని బాలిలో పదిహేడవ జీ-20 సదస్సు మంగ‌ళ‌వారం ప్రారంభ‌మైంది. ఈ స‌ద‌స్సులో పాల్గొన భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ సుదీర్ఘ ప్ర‌సంగం చేశారు. వాతావ‌ర‌ణ మార్పులు, పుడ్ అండ్ ఎన‌ర్జీ సెక్యూరిటీ, క‌రోనా మ‌హ‌మ్మారి, ఉక్రెయిన్ యుద్ధ ప‌రిస్థితులు స‌హా ప‌లు అంశాల గురించి మోదీ ప్ర‌స్తావించారు. రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధాన్ని ఆపడానికి దౌత్యమార్గాన్ని అన్వేషించాల్సిన అవసరం ఉందని ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని తెలిపారు. ఇందుకోసం ప్ర‌పంచం స‌మిష్టిగా కృషి చేయాల‌ని మోదీ దేశాధినేత‌ల‌కు పిలుపునిచ్చారు. క‌రోనా తర్వాత కొత్త ప్రపంచ వ్యవస్థను సృష్టించే బాధ్యత మనపై ఉందని చాటి చెప్పారు.

రెండో ప్ర‌పంచ యుద్ధం.. ప్ర‌పంచ విధ్వంసానికి కార‌మైంది. ఆ త‌రువాత శాంతి నెల‌కొల్పేందుకు అప్ప‌టి ప్ర‌పంచ నేత‌లు చాలా ప్ర‌య‌త్నాలు చేశారు. ఇప్పుడు మ‌న వంతు వ‌చ్చింది. వాతావ‌ర‌ణ మార్పులు, క‌రోనా మ‌హ‌మ్మారి, ఉక్రెయిన్ యుద్ధ ప‌రిస్థితులు ఇప్పుడు ప్ర‌పంచంలో విధ్వంసం సృష్టిస్తున్నాయి. ఈ స‌మ‌యంలో ప్ర‌పంచం శాంతి, సామ‌ర‌స్యం, భ‌ద్ర‌త‌ను నిర్థారించడానికి ఖ‌చ్చిత‌మైన, సామూహిక సంక‌ల్పాన్ని ప్ర‌ద‌ర్శించ‌డం అవ‌స‌రం. వ‌చ్చే ఏడాది బుద్ధుడు, గాంధీల ప‌విత్ర భూమిలో(భార‌త్‌లో జ‌ర‌గ‌బోయే స‌మావేశాన్ని ఉద్దేశించి) జీ20 స‌మావేశ‌మైన‌ప్పుడు మ‌నమంతా ప్రపంచ‌శాంతి అనే బ‌ల‌మైన సందేశం తెలియ‌జేయ‌డానికి అంగీక‌రిస్తామ‌ని నేను విశ్వ‌సిస్తున్నా అని ప్ర‌ధాని మోదీ అన్నారు.

భార‌త్‌లో ఆహార భ‌ద్ర‌త‌ను ప్ర‌స్తావించారు. నేటి ఎరువుల కొర‌త రేప‌టి ఆహార సంక్షోభానికి దారి తీయ‌వ‌చ్చున‌ని అన్నారు. ఎరువులు, ఆహార ధాన్యాల సరఫరా గొలుసును స్థిరంగా ఉంచేలా ప్రపంచ దేశాలు మధ్య ఒప్పందాలు జరగాలన్నారు.

మోదీ - బైడెన్ ఆలింగనం

భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్ మ‌ధ్య ఆత్మీయ‌త వెల్లివిరిసింది. జీ-20 సద‌స్సులో పాల్గొన‌డానికి వ‌చ్చిన ఈ ఇద్ద‌రు నేత‌లు ఆప్యాయంగా ఆలింగ‌నం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోల‌ను ప్ర‌ధాని మంత్రి కార్యాల‌యం సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది.

Next Story