భారత్‌కు రానున్న‌ జెలెన్స్కీ.. ఎప్పుడంటే..

ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వోలోడిమిర్‌ జెలెన్స్కీని భారత్‌లో పర్యటించాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ఆహ్వానించగా.. ఈ ఏడాది చివరి నాటికి ఆయన భారత్‌కు రావచ్చని చెబుతున్నారు

By Medi Samrat  Published on  9 Sept 2024 4:51 PM IST
భారత్‌కు రానున్న‌ జెలెన్స్కీ.. ఎప్పుడంటే..

ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వోలోడిమిర్‌ జెలెన్స్కీని భారత్‌లో పర్యటించాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ఆహ్వానించగా.. ఈ ఏడాది చివరి నాటికి ఆయన భారత్‌కు రావచ్చని చెబుతున్నారు. భారత్‌లోని ఉక్రెయిన్ రాయబారి అలెగ్జాండర్ పోలిష్‌చుక్ ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రధాని మోదీ భారతదేశాన్ని సందర్శించాల్సిందిగా మా అధ్యక్షుడిని ఆహ్వానించారు, అది జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. బహుశా ఈ సంవత్సరం చివరి నాటికి.. ప్రెసిడెంట్ జెలెన్స్కీని ఇక్కడ చూడటం మాకు సంతోషంగా ఉంటుంది.. అయితే ఆయ‌న‌ భారతదేశానికి వచ్చే తేదీ ఇంకా నిర్ణయించలేద‌న్నారు. ఆయ‌న ప‌ర్య‌ట‌న‌ మన ద్వైపాక్షిక సంబంధాలలో మరో ముందడుగు వేయనుంది. ప్రపంచవ్యాప్తంగా శాంతి స్థాపన ప్రక్రియపై చర్చించేందుకు ఇరువురు నేతలకు ఇది గొప్ప అవకాశాన్ని కల్పిస్తుందన్నారు.

ఉక్రెయిన్ రాయబారి జెలెన్స్కీ ఇటీవల ఉక్రెయిన్ పర్యటన గురించి కూడా ప్రస్తావించారు, భద్రతా కారణాల దృష్ట్యా ప్రధాని మోదీ పర్యటన కూడా చిన్నగానే జ‌రిగింద‌ని చెప్పారు. భార‌త్‌లో ఇద్దరు నేతలకు చర్చలకు ఎక్కువ సమయం ఉంటుందన్నారు, "అధ్యక్షుడు జెలెన్స్కీ భారతదేశాన్ని సందర్శించడానికి చాలా ఆసక్తిగా ఉన్నారని నాకు ఖచ్చితంగా తెలుసు. ఆయ‌న‌ ఎప్పుడూ ఇక్కడకు రాలేదు. ఈ పర్యటన ఇరుపక్షాలకు గొప్ప అవకాశం. అనుకూలమైన సమయంలో జరుగుతుందన్నారు.

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆహ్వానం మేరకు ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది ఆగస్టు 23న ఉక్రెయిన్‌లో పర్యటించారు. 1992లో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడిన తర్వాత భారత ప్రధాని ఉక్రెయిన్‌లో పర్యటించడం ఇదే తొలిసారి.

Next Story