ఆ దేశంలో కూడా ఆధార్ తరహా ID కార్డ్.. ఇండియా చేరుకున్న ప్రధాని
బ్రిటన్ ప్రధాని కైర్ స్టార్మర్ బుధవారం ముంబై చేరుకున్నారు.
By - Medi Samrat |
బ్రిటన్ ప్రధాని కైర్ స్టార్మర్ బుధవారం ముంబై చేరుకున్నారు. ఆయన భారతదేశానికి చేరుకున్న వెంటనే చేసిన మొదటి పని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు, యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఛైర్మన్ నందన్ నీలేకనిని కలవడం. వాస్తవానికి బ్రిటన్ ఆధార్ తరహాలో డిజిటల్ గుర్తింపు వ్యవస్థ కోసం ఒక ప్రణాళికను పరిశీలిస్తోంది. నీలేకనితో సమావేశమైంది ఇన్ఫోసిస్‌తో ఎలాంటి వాణిజ్య ఒప్పందం గురించి కాదని.. UK ప్రభుత్వం ఆధార్ పథకం తరహాలో తన స్వంత డిజిటల్ వెర్షన్‌ను రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకుందని స్టార్‌మర్ ప్రతినిధి తెలిపారు.
బ్రిటీష్ PM స్టార్మర్ తన దేశంలో కూడా ఆధార్ తరహాలో స్మార్ట్‌ఫోన్ ఆధారిత డిజిటల్ గుర్తింపు IDని ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లు తన ఉద్దేశాన్ని వ్యక్తం చేశారు. బ్రిటన్‌లో ఈ ప్రయోగం పూర్తిగా భారతీయ సాంకేతికతపై ఆధారపడి ఉంటుంది. ఈ గుర్తింపు IDని సృష్టించడం వెనక ప్రధాన లక్ష్యం.. అక్రమంగా బ్రిటన్‌కు వచ్చే వలసదారులను నిషేధించడం.. అందువల్ల ఇప్పటికే అటువంటి డిజిటల్ ఐడి సేవలను ప్రారంభించిన భారత్ వంటి దేశాలతో మాట్లాడుతున్నట్లు స్టార్మర్ ప్రతినిధి తెలిపారు. భారత్‌లో ఆధార్ సేవ 2009లో ప్రారంభించబడింది.
ఒకవైపు బ్రిటీష్ పీఎం స్టార్‌మర్ భారత్‌లో ఆధార్ సేవ గురించి చర్చిస్తుండగా.. మరోవైపు బ్రిటన్‌లో డిజిటల్ గుర్తింపు కార్డుకు మద్దతు భారీగా తగ్గుతోంది. ఈ పథకాన్ని వ్యతిరేకిస్తామని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. అయితే.. బ్రిటీష్ ప్రధాని తన ప్రణాళికపై చాలా ఉత్సాహంగా ఉన్నారు. ముంబైకి బయలుదేరే ముందు మీడియాతో మాట్లాడుతూ.. "మేము భారతదేశానికి వెళ్తున్నాము, అక్కడ ఇప్పటికే గుర్తింపు కార్డు జారీ చేయబడుతోంది, అక్కడ ఇది భారీ విజయాన్ని సాధించింది. కాబట్టి అక్కడ నా సమావేశాలలో ఒకటి గుర్తింపు కార్డుకు సంబంధించినదని పేర్కొన్నారు.