వివాదాస్పద ప్రాంతాల కబ్జాకు చైనా ప్రయత్నం
Philippines accuses China of plans to occupy. వివాదాస్పద ప్రాంతాలను చైనా కబ్జా చేసే యోచనలో ఉన్నట్టు కనబడుతోందని ఫిలిప్పీన్స్ ప్రభుత్వం సంచలన వ్యాఖ్యలు చేసింది.
By Medi Samrat Published on 5 April 2021 7:57 AM ISTదక్షిణ చైనా సముద్రంలో వివాదాస్పద ప్రాంతాలను చైనా కబ్జా చేసే యోచనలో ఉన్నట్టు కనబడుతోందని ఫిలిప్పీన్స్ ప్రభుత్వం సంచలన వ్యాఖ్యలు చేసింది. చేపలు పట్టడానికి వచ్చామని చెబుతూ ఆయుధాలున్న నావలను మోహరిస్తున్న చైనా తీరును చూస్తే ఇదే అనుమానం కలుగుతోందని పేర్కొంది. ఈ మేరకు ఫిలిప్పీన్స్ రక్షణ శాఖ మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో చైనా ఇటువంటి చర్యలకు పాల్పడిందని కూడా వ్యాఖ్యానించాడు. ఫిలిప్పీన్స్ అభ్యంతరం చెబుతున్న ప్రాంతాల్లో తమ దేశస్థులు అనేక సంవత్సరాలుగా చేపలపడుతున్నారంటూ చైనా చేసిన ప్రకటనకు స్పందనగా ఫిలిప్పీన్స్ మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.
మార్చి 7వ తేదీన కూడా వివాదాస్పద జూలియన్ ఫిలిప్పే ద్వీపం వద్దకు 220కి పైగా చైనా చేపల వేట ఓడలు తరలి వచ్చాయి. సైజులో చైనా చేపలవేట ఓడలు చిన్నసైజు యుద్ధనౌకలను తలిపిస్తుంటాయి. వీటికి చైనా కోస్టుగార్డు మద్దతు ఉంది. ఈ విషయాన్ని ఫిలిప్పీన్స్ రక్షణ శాఖ ప్రకటించింది. ఆ దేశ రక్షణ మంత్రి డెల్ఫెన్ లోరెన్జాన మాట్లాడుతూ ఫిలిప్పీన్స్ సముద్ర హక్కులను చైనా ఉల్లంఘిస్తోందని మండిపడ్డారు. అక్కడకు వచ్చినవారు మత్సకారులు కాదని.. చైనా సముద్రపు దుండగుల మూక అని పేర్కొన్నారు.
ఒకప్పుడు సముద్రంలో చైనా అరాచకాలపై అంతర్జాతీయ న్యాయస్థానానికి వెళ్లిన దేశం ఫిలిప్పీన్స్. 2012లో ఫిలిప్పీన్స్ నౌకాదళం చైనా పడవలను అడ్డుకొంది. దీంతో ఇరు దేశాల మధ్య వివాదం రాజుకుంది. ఫిలిప్పీన్స్‌ను ఎలాగైనా ఇబ్బంది పెట్టాలనుకుని చైనా ఓ ఎత్తుగడ వేసింది. ఫిలిప్పీన్స్ రైతులు పండించే అరటి పండ్లకు చైనానే అతిపెద్ద మార్కెట్. దీంతో ఫిలిప్పీన్స్ అరటిపండ్ల నాణ్యతకు వంకలు పెట్టి కొనుగోళ్లను తగ్గించింది. వందల కొద్దీ కంటైనర్లను తిప్పి పంపడం మొదలుపెట్టింది. అపరిశుభ్రంగా ఉన్నాయని కొన్నింటిని ధ్వంసం కూడా చేసింది. తర్వాత ఇతర పండ్లను కొనేందుకు కూడా సాకులు చూపడం మొదలుపెట్టింది. దీంతో ఫిలిప్పీన్స్‌లోని కొన్ని లక్షల మంది రైతులు అవస్థలు పడ్డారు. బిలియన్ల డాలర్ల కొద్దీ నష్టం వాటిల్లింది. అయితే 2016లో తాము అమెరికాకు దూరం అయ్యే అవకాశాలున్నాయని ఫిలిప్పిన్స్ అధ్యక్షుడు రోడ్రిగా డ్యుటెరెట్టి సంకేతాలు ఇవ్వడంతో చైనా శాంతించింది. దిగుమతులను పెంచింది.
నిజానికి అధ్యక్షుడు రోడ్రిగా డ్యుటెరెట్టి అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి చైనాతో స్నేహంగా ఉండేందుకు.. వీలైనంత ఉదాసీనంగా వ్యవహరించారు. అయినా చైనా తీరులో ఏమాత్రం తేడారాలేదు. దక్షిణ చైనా సముద్రం తమదే అన్న వాదనలో ఏమాత్రం తగ్గలేదు. మరోపక్క రక్షణ భాగస్వామిగా ఉన్న అమెరికాతో ఒప్పందాలను రద్దు చేసుకొనేందుకు కూడా డ్యుటెరెట్టి ప్రయత్నించారు. ఈ చర్య మిత్రదేశమైన అమెరికాను దూరం చేసిందే తప్ప చైనాను దగ్గర చేయలేదు.