ప్రాణాల‌తో చెల‌గాటం.. ప్లాస్టిక్ క‌వ‌ర్ల‌లో వంట‌గ్యాస్ నిల్వ‌.. పాక్ ప్ర‌జ‌ల దీన‌స్థితి

People in Pakistan fill cooking gas in plastic balloons amid crisis. పాకిస్థాన్‌ను ఆర్థిక సంక్షోభం చుట్టుముట్టింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 Jan 2023 3:22 AM GMT
ప్రాణాల‌తో చెల‌గాటం.. ప్లాస్టిక్ క‌వ‌ర్ల‌లో వంట‌గ్యాస్ నిల్వ‌.. పాక్ ప్ర‌జ‌ల దీన‌స్థితి

పాల‌కుల అక్ర‌మాలు, అనాలోచిత నిర్ణ‌యాల కార‌ణంగా ఇటీవ‌ల కాలంలో చాలా దేశాలు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. మొన్న శ్రీలంక‌లో తీవ్ర ఆర్థిక సంక్షోభం త‌లెత్త‌డంతో అక్క‌డి ప్ర‌జ‌లు తిరుగుబాటు చేయ‌గా ఆ దేశ అధ్య‌క్షడు, ప్ర‌ధాని త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేసిన సంగ‌తి తెలిసిందే. తాజాగా మ‌న పొరుగున ఉన్న పాకిస్థాన్‌ను ఆర్థిక సంక్షోభం చుట్టుముట్టింది. దీంతో ఆ దేశంలోని ప్ర‌జ‌ల‌కు అక్క‌డి ప్ర‌భుత్వం క‌నీస మౌలిక స‌దుపాయాలు క‌ల్పించ‌లేక‌పోతుంది.

ద్రవ్యోల్బణం, పెట్రోలియం, గ్యాస్ నిల్వలు తగ్గిపోవడం, కరెన్సీ విలువ పడిపోవడం వంటి అంశాలు పాకిస్థాన్‌ను మ‌రింత క‌ష్టాల్లోకి నెట్టేస్తున్నాయి. ఎలాగైనా ఈ సంక్షోభం నుంచి గ‌ట్టు ఎక్కేందుకు ఎన్ని ప్ర‌యత్నాలు చేయాలో అన్ని ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఇప్ప‌టికే ప్ర‌భుత్వ ఉద్యోగ‌లుకు ఇస్తున్న జీతాల్లో కోత విధించింది. నిత్య‌వ‌స‌ర వ‌స్తువుల ధ‌ర‌ల‌ను అదుపు చేయ‌లేక చేతులెత్తేసింది. క‌నీసం వంట గ్యాస్ స‌ర‌ఫ‌రా చేయ‌లేక‌పోతుండ‌డం అక్క‌డి ప‌రిస్థితికి అద్దం ప‌డుతోంది. ఈ క్ర‌మంలో కొంద‌రు ప్ర‌జ‌లు వంట‌గ్యాస్‌ను ప్లాస్టిక్ క‌వ‌ర్ల‌లో నిల్వ చేసుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన ప‌లు వీడియోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

ముఖ్యంగా ఖైబర్ పఖ్తున్ఖ్వాలో వంట గ్యాస్ కొర‌త తీవ్రంగా వేధిస్తోంది. దీంతో అక్క‌డి ప్ర‌జ‌లు వంట‌గ్యాస్ ప్లాస్టిక్ క‌వ‌ర్ల‌లో నింపుకుని వెలుతున్న‌ట్లు అక్క‌డి మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి. వంట గ్యాస్ సిలిండ‌ర్లు స‌ర‌ఫ‌రా లేక‌పోవ‌డ‌మే కార‌ణంగా తెలుస్తోంది. భారీ సైజులో వైట్ ప్లాస్టిక్ బ్యాగుల్లో వంట‌గ్యాస్‌ను నింపి అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన రీతీలో వీటిని తీసుకువెలుతున్న‌ వీడియోలు వైర‌ల్ కావ‌డంతో పాక్ అధికారులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. ప్లాస్టిక్ బ్యాగుల వినియోగంపై ఆంక్ష‌లు విధించిన‌ట్లు స్థానిక మీడియా తెలిపింది.

Next Story