టైరు పేలి రన్‌వేపై నిలిచిన విమానం.. పక్కకు నెట్టిన ప్రయాణికులు.. వైరల్‌ వీడియో

Passengers Filmed Pushing Airplane Off Runway. కొంతమంది వ్యక్తులు విమానాన్ని రన్‌వేపై నుంచి పక్కకు తోస్తున్న అసాధారణ దృశ్యం.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

By అంజి  Published on  4 Dec 2021 11:32 AM GMT
టైరు పేలి రన్‌వేపై నిలిచిన విమానం.. పక్కకు నెట్టిన ప్రయాణికులు.. వైరల్‌ వీడియో

కొంతమంది వ్యక్తులు విమానాన్ని రన్‌వేపై నుంచి పక్కకు తోస్తున్న అసాధారణ దృశ్యం.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నేపాల్‌లోని ఓ విమానాశ్రయంలో ప్రయాణికులు రన్‌వేపై ఆగిపోవడంతో తారా ఎయిర్‌ విమానాన్ని పక్కకు నెట్టారు. కోల్టీలోని బజురా విమానాశ్రయంలో ల్యాండింగ్ చేస్తున్నప్పుడు విమానం వెనుక టైర్ పేలింది. దీని కారణంగా విమానం రన్‌వే నుండి కదలలేకపోయింది. దీంతో ఇతర విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇది గమనించిన విమానాశ్రయంలోని ప్రయాణికులు భద్రతా సిబ్బందితో కలిసి విమానాన్ని రన్‌వేపై నుంచి పక్కకు నెట్టారు. రన్‌వే నుండి విమానాన్ని పక్కకు నెట్టడానికి దాదాపు 20 మంది వ్యక్తుల బృందం కలిసి పనిచేస్తున్నట్లు ఫుటేజీ చూపిస్తోంది. "నేపాల్‌లో మాత్రమే" అని క్యాప్షన్‌ పెట్టి ఓ నెటిజన్‌ దీనికి సంబంధించిన వీడియోను ట్విటర్‌లో పెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియోను ఎంతో మంది వైరల్‌ చేస్తున్నారు.

తారా ఎయిర్ 9N-AVE విమానం హుమ్లాలోని సిమ్‌కోట్ నుండి బజురా ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయిందని హిమల్ సంచార్‌కి ఏతి ఎయిర్‌లైన్స్ ప్రతినిధి సురేంద్ర బర్తౌలా తెలిపారు. అయితే దాని టైర్ పగిలిపోవడంతో రన్‌ వేపై నిలిచిపోయింది. దీంతో మరో విమానం ల్యాండ్ కాలేని పరిస్థితి నెలకొంది. విమానాన్ని అవతలి వైపుకు లాగడానికి ఎటువంటి మౌలిక సదుపాయాలు లేకపోవడంతో, విమాన కార్యకలాపాలు పునఃప్రారంభించ గలిగేలా విమానాన్ని తరలించడానికి ప్రయాణికులు విమానాశ్రయ అధికారులను కలిశారు. తారా ఎయిర్ విమానాన్ని విజయవంతంగా బయటకు తరలించిన తర్వాత మరో విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. కొద్దిసేపటికే విమానం పంక్చర్ అయిన టైరును కూడా మార్చారు.


Next Story