విమాన ప్రయాణాలు చేసే సమయంలో ఎన్నో నియమాలు, నిబంధనలు ఉంటాయి. సెక్యూరిటీ చెక్-ఇన్ సమయంలో ప్రయాణీకుల లగేజీని క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉంటారు. నిషిద్ధ వస్తువులను తీసుకుని వెళ్లకూడదని చెబుతూ ఉంటారు. ముఖ్యంగా ఆహార పదార్థాలను అనుమతించరు. అక్కడే ఉన్న డస్ట్ బిన్ లో పారేయాల్సి ఉంటుంది. అలా హిమాన్షు దేవ్‌గన్ అనే భారతీయ వ్యక్తికి ఫుకెట్ ఎయిర్‌పోర్ట్‌లో ఇలాంటిదే ఎదురైంది. అతని లగేజ్ తో పాటూ గులాబ్ జామూన్ల డబ్బాలను తీసుకెళ్లడానికి అనుమతించలేదు. దీంతో అతడు అక్కడే గులాబ్ జామూన్ డబ్బాను తెరిపించి.. విమానాశ్రయ అధికారులతో స్వీట్లను పంచుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ మొత్తం ఘటనని రికార్డ్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేశాడు. ఈ వీడియో 1 మిలియన్‌కు పైగా వ్యూస్ తో దూసుకుపోతోంది.
ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో.. హిమాన్షు గులాబ్ జామూన్ డబ్బాను తెరిచి, భద్రతా అధికారులకు అందించడాన్ని చూడవచ్చు. "సెక్యూరిటీ చెక్‌లో గులాబ్ జామూన్‌లను తీసుకెళ్లకూడదని వారు చెప్పడంతో, మేము మా ఆనందాన్ని వారితో పంచుకోవాలని నిర్ణయించుకున్నాము. ఫుకెట్ విమానాశ్రయం," అని వీడియోలో చెప్పారు.