Video : విమానంలో చెల‌రేగిన‌ మంట‌లు.. లోప‌ల 104 మంది ప్రయాణికులు.. దయచేసి మమ్మల్ని ర‌క్షించండి అంటూ..

అమెరికాలో ఆదివారం పెను విమాన ప్రమాదం తప్పింది. హ్యూస్టన్ విమానాశ్రయంలో యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానం టేకాఫ్ అవుతుండగా మంటలు చెలరేగాయి.

By Medi Samrat  Published on  3 Feb 2025 9:41 AM IST
Video : విమానంలో చెల‌రేగిన‌ మంట‌లు.. లోప‌ల 104 మంది ప్రయాణికులు.. దయచేసి మమ్మల్ని ర‌క్షించండి అంటూ..

అమెరికాలో ఆదివారం పెను విమాన ప్రమాదం తప్పింది. హ్యూస్టన్ విమానాశ్రయంలో యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానం టేకాఫ్ అవుతుండగా మంటలు చెలరేగాయి. హ్యూస్టన్‌లోని జార్జ్ బుష్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి న్యూయార్క్‌కు వెళ్లేందుకు రన్‌వేపై బయలుదేరిన విమానం రెక్కల్లో ఒకదానికి మంటలు అంటుకున్నాయి. దీంతో సిబ్బంది వెంటనే విమానాన్ని రన్‌వేపై నిలిపివేశారు. అనంత‌రం ప్రయాణికులను విమానం నుంచి బ‌య‌ట‌కు తరలించారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని హ్యూస్టన్ అగ్నిమాపక శాఖ తెలిపింది. న్యూయార్క్ పోస్ట్ నివేదిక ప్రకారం.. విమానంలో 104 మంది ప్రయాణికులు, ఐదుగురు సిబ్బంది ఉన్నారు. పలువురు ప్రయాణికులు ఈ ఘటనను సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. విమానంలోని రెక్కలో మంటలు చెలరేగాయన్న విషయం తెలియగానే ప్రయాణికులు తీవ్ర ఉద్రిక్తతకు లోనవ‌డం వీడియోలో చూడవచ్చు. ప్ర‌యాణికుల‌లో ఒకరు మంటలను చూసి అరుస్తున్న వారి వీడియో రికార్డ్ చేశారు. ఒక ప్రయాణీకుడు..“దయచేసి మమ్మల్ని ఇక్కడి నుండి బ‌య‌ట‌కు పంపించివేయండి” అని కేకలు వేయడం వినబడింది, మరికొందరు షాక్ అయ్యి సహాయం చేయ‌మ‌ని అభ్య‌ర్ధిస్తున్నారు.

గతంలో ఇద్దరు వ్యక్తులతో వెళ్తున్న చిన్న విమానం అమెరికాలోని ఫిలడెల్ఫియాలోని ఓ షాపింగ్ మాల్ సమీపంలో కుప్పకూలింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందినట్లు సమాచారం. ఫిలడెల్ఫియా ఎంక్వైరర్ వార్తాపత్రిక, పోలీసులను ఉటంకిస్తూ.. ఈ ప్రమాదం సాయంత్రం 6 గంటలకు జరిగిందని తెలిపింది. ఈ విమాన ప్రమాదంలో పలు ఇళ్లు, కార్లు అగ్నికి ఆహుతయ్యాయి. అలాగే.. శుక్రవారం తెల్లవారుజామున ఫిలడెల్ఫియాలోని మాల్ సమీపంలో ఓ విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా, 19 మంది గాయపడ్డారు.

Next Story