పాకిస్థాన్‌లో నిత్యావసర వస్తువుల ధరలు మరోసారి పెరిపోయాయి. ఇటీవలి కాలంలో భారీగా పెరుగుతున్న ధరల కారణంగా సామాన్యుల జేబుకు చిల్లులు పెడుతున్నాయి. 2022లో సంభవించిన భారీ వరదల వల్ల ఏర్పడిన సంక్షోభం నుండి దేశం ఇంకా కోలుకోకపోగా.. ఇప్పుడు ద్రవ్యోల్బణం కారణంగా దారుణమైన ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంది. ఆ దేశంలో జనవరి 6, 2022న కిలో రూ.36 రూపాయలుగా ఉన్న ఉల్లి ధరలు.. జనవరి 5, 2023న కిలో రూ.220.4కి చేరాయి. డీజిల్ ధరలు 61 శాతం పెరిగాయి, పెట్రోల్ ధరలు 48 శాతం పెరిగాయి. బియ్యం, పప్పులు, గోధుమల ధరలు కూడా ఏడాదిలో దాదాపు 50 శాతం పెరిగాయి.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ ప్రకారం.. పాకిస్తాన్‌లో ప్రధాన ద్రవ్యోల్బణం డిసెంబర్ 2021లో 12.3 శాతం ఉండగా.. 2022 డిసెంబర్‌లో 24.5 శాతానికి చేరుకుంది. దీని కారణంగా ఆహార పదార్థాల ధరల భారీగా పెరిగిపోయాయి. ఆహార ద్రవ్యోల్బణం రేటు డిసెంబర్ 2021లో 11.7 శాతం నుండి.. డిసెంబర్ 2022 నాటికి 32.7 శాతానికి.. దాదాపు మూడు రెట్లు పెరిగింది.
ఇక పాకిస్థాన్ స్థూల ఆర్థిక వ్యవస్థ కూడా దారుణంగా దిగజారిపోయింది. పాక్ విదేశీ మారకద్రవ్య నిల్వలు కూడా పతనావస్థకు చేరుకున్నాయి. దేశం ఫారెక్స్ నిల్వలు డిసెంబర్ 2021లో USD 23.9 బిలియన్లు ఉండగా.. డిసెంబర్ 2022లో కేవలం USD 11.4 బిలియన్లకు పడిపోయాయి. ఈ పరిస్థితులను చూస్తుంటే.. పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ ఇప్పట్లో కోలుకునేలా కనిపించడం లేదు.