పోలీస్ స్టేషన్‌పై ఉగ్రదాడి, 10 మంది పోలీసులు మృతి
పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఏకంగా పోలీస్ స్టేషన్‌పైనే దాడికి తెగబడ్డారు.
By Srikanth Gundamalla
పోలీస్ స్టేషన్‌పై ఉగ్రదాడి, 10 మంది పోలీసులు మృతి
పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఏకంగా పోలీస్ స్టేషన్‌పైనే దాడికి తెగబడ్డారు. ఈ సంఘటనలో మొత్తం 10 మంది పోలీసులు దుర్మరణం చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఈ సంఘటన పాకిస్థాన్‌లో సంచలనంగా మారింది. ఫిబ్రవరి 8వ తేదీని పాకిస్థాన్‌లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకు మరో మూడ్రోజులు ఉందనగా ఈ సంఘటన జరగడం చర్చనీయాంశం అవుతోంది.
వాయువ్య పాకిస్థాన్‌లోని డేరా ఇస్మాయిల్‌ఖాన్‌లో ఉన్న చోడ్వాన్ పోలీస్ స్టేషన్‌పై ఉగ్రదాడి జరిగింది. స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 3 గంటలకు ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. స్నిపర్‌లను ఉపయోగించి కానిస్టేబుళ్లను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ భవనంలోకి చొరబడ్డారు. విచక్షణారహితంగా పోలీసులపై కాల్పులకు పాల్పడ్డారు. ఈ విషయాన్ని పాకిస్థాన్‌లోని డ్రాబన్ ప్రాంతంలో పోలీసు అధికారులు నివేదించారు.
డ్రబన్‌లోని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మాలిక్ అనీస్ ఉల్ హసన్ మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్ భవనంలోకి ప్రవేశించిన తర్వాత ఉగ్రవాదులు హ్యాండ్ గ్రనేడ్‌లను కూడా ఉపయోగించారని తెలిపారు. ఇలా చేయడం ద్వారా ఎక్కువ మంది పోలీసులు చనిపోయారని చెప్పారు. కాగా.. ఇటీవల కాలంలో పాకిస్థాన్‌లో హింసాత్మక సంఘటనలు పెరిగిపోతున్నాయి.