పాక్​ ప్రధాని సంచలన వ్యాఖ్యలు.. తాలిబ‌న్లు సాధార‌ణ పౌరులే.. వారిని ఎందుకు చంపాలి

Pakistan PM Imran Khan says Talibans are normal civilians.పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేస్తూ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  29 July 2021 1:08 PM IST
పాక్​ ప్రధాని సంచలన వ్యాఖ్యలు.. తాలిబ‌న్లు సాధార‌ణ పౌరులే.. వారిని ఎందుకు చంపాలి

పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేస్తూ నిత్యం వార్త‌ల్లో ఉంటున్నాడు. తమ దేశంలో అత్యాచార ఘటనలు పెరిగిపోవడానికి మహిళల డ్రెస్సింగ్ కారణమంటూ ఇటీవల ఇమ్రాన్ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండ‌గానే.. తాజాగా ఆయన తాలిబన్ల గురించి చేసిన కామెంట్లు కూడా కాంట్రవర్షియల్‌గా ఉన్నాయి. తాలిబన్లకు పాక్ ఆర్థిక సాయం చేస్తోందా అని ఓ న్యూస్ చానల్‌ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ఇమ్రాన్ ఇచ్చిన సమాధానం చర్చనీయాంశంగా మారింది. ఇందులో ఎలాంటి నిజం లేదని, ఒకవేళ ఈ వాదన సత్యమని భావిస్తే ఆధారాలు చూపించాలని ఇమ్రాన్ చెప్పారు.

'తాలిబ‌న్లు సాధార‌ణ పౌరులు. వాళ్లేమీ మిలిట‌రీ కాదు. అలాంటి వాళ్ల‌ను పాకిస్థాన్ ఎలా ఏరివేయ‌గ‌ల‌దు. మా దేశ సరిహద్దుల్లో 30 లక్షల మంది ఆఫ్ఘన్ శరణార్థులు గుడారాలేసుకుని ఉంటున్నారు. వాళ్లలో కొందరు ఆ 'సామాన్య ప్రజలూ' ఉన్నారు. అలాంటప్పుడు ఆ సామాన్య ప్రజలను మేమెలా వేటాడి చంపేస్తాం?' అని అన్నారు. తాము తాలిబ‌న్ల‌కు ర‌క్ష‌ణ క‌ల్పిస్తున్నామ‌న్న ఆరోప‌ణ‌లు, ఆర్థికంగా తోడ్పాటునందించి, ఆయుధాలనూ సరఫరా చేస్తోందన్న వ్యాఖ్యలను ఆయన ఖండించారు. అవి నీచ ప్రచారాలని, అలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్న వారు ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు.

త‌ప్పంతా అమెరికాదే అని ఈ సంద‌ర్భంగా ఇమ్రాన్ అన్నారు. ఆప్ఘ‌నిస్థాన్‌లో వాళ్ల‌ మిలిట‌రీని దించి, రాజ‌కీయ సుస్థిర‌త సాధించ‌డానికి తాలిబ‌న్ల‌తో చ‌ర్చిస్తే ప‌రిష్కారం ఎలా వ‌స్తుంద‌ని ప్ర‌శ్నించారు. తాలిబ‌న్ల‌తో ముందుగానే అమెరికా రాజ‌కీయ సుస్థిర‌త కోసం ప్ర‌య‌త్నించి ఉండాల్సింద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. ఇప్పుడు అమెరికా ద‌ళాలు వెన‌క్కి వెళ్లిపోవ‌డంతో తాలిబ‌న్లు తాము గెలిచామ‌ని అనుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ల‌తో రాజీ క‌ష్ట‌మ‌వుతుంది అని ఇమ్రాన్ అన్నారు.

ఆఫ్ఘనిస్థాన్ లో పౌర యుద్ధం వచ్చే పరిస్థితులూ ఉన్నాయన్నారు. అలాంటి పరిస్థితి తలెత్తకుండా అమెరికా, తాలిబన్ల మధ్య చర్చలకు తాను సాయం చేస్తానని ఇమ్రాన్ చెప్పారు. చర్చలు జరిగేందుకు మాత్రమే సాయం చేస్తామని, మిగతా ఎలాంటి విషయాల్లోనూ అమెరికాతో సంబంధాలు పెట్టుకోబోమని స్పష్టం చేశారు.

Next Story