నన్ను జైల్లో పెట్టాలని పాక్ మిలటరీ యోచిస్తోంది: ఇమ్రాన్ ఖాన్
దేశద్రోహ నేరం కింద వచ్చే పదేళ్లపాటు తనను జైల్లో ఉంచాలని ఆ దేశ శక్తివంతమైన మిలటరీ యోచిస్తోందని, తన చివరి రక్తపు బొట్టు వరకు
By అంజి Published on 15 May 2023 11:01 AM IST
నన్ను జైల్లో పెట్టాలని పాక్ మిలటరీ యోచిస్తోంది: ఇమ్రాన్ ఖాన్
దేశద్రోహ నేరం కింద వచ్చే పదేళ్లపాటు తనను జైల్లో ఉంచాలని ఆ దేశ శక్తివంతమైన మిలటరీ యోచిస్తోందని, తన చివరి రక్తపు బొట్టు వరకు ‘మోసగాళ్ల వర్గాలకు’ వ్యతిరేకంగా పోరాడతానని పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సోమవారం ప్రకటించారు. కార్ప్స్ కమాండర్ ఇంటిని తగలబెట్టినందుకు, గత వారం అవినీతి కేసులో అరెస్టయిన తర్వాత చెలరేగిన ఇతర హింసాత్మక సంఘటనలకు సంబంధించి తనపై నమోదైన కేసులకు సంబంధించి ఇమ్రాన్ ఖాన్ లాహోర్ హైకోర్టుకు హాజరయ్యే అవకాశం ఉంది.
ఇస్లామాబాద్ హైకోర్టు (IHC) 70 ఏళ్ల ఖాన్‌కు బెయిల్ మంజూరు చేసింది. మే 9 తర్వాత నమోదైన అన్ని కేసులలో అతన్ని అరెస్టు చేయకుండా అధికారులను నిషేధించింది. మే 15న తదుపరి ఉపశమనం కోసం లాహోర్ హైకోర్టును ఆశ్రయించాలని కోరింది. సోమవారం తెల్లవారుజామున వరుస ట్వీట్లలో.. పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) చీఫ్ ఇమ్రాన్ ఖాన్ ఇలా అన్నారు. ''ఇప్పుడు పూర్తి లండన్ ప్రణాళిక ముగిసింది. నేను జైలులో ఉన్నప్పుడు హింసను సాకుగా చూపి రాబోయే పదేళ్లపాటు నన్ను లోపల ఉంచడానికి దేశద్రోహ చట్టాన్ని ఉపయోగించేందుకు ప్లాన్ చేస్తున్నారు'' అని పేర్కొన్నారు. ఖాన్ తన లాహోర్ నివాసంలో పీటీఐ నేతలతో సమావేశం నిర్వహించిన తర్వాత ఈ ట్వీట్లు వచ్చాయి .
పాకిస్తాన్ ప్రజలకు తన సందేశాన్ని ఇస్తూ ఖాన్ ఇలా అన్నాడు: ''పాకిస్తాన్ ప్రజలకు నా సందేశం; నేను హకీకీ ఆజాదీ (నిజమైన స్వాతంత్ర్యం) కోసం నా చివరి రక్తపు బొట్టు వరకు పోరాడతాను ఎందుకంటే ఈ మోసగాళ్లకు బానిసలుగా ఉండటం కంటే నాకు మరణమే శ్రేయస్కరం'' అని అన్నాడు. గత మంగళవారం ఇస్లామాబాద్ హైకోర్టు ప్రాంగణంలో పాకిస్తాన్ రేంజర్లు ఖాన్‌ను అరెస్టు చేయడంతో పాకిస్తాన్‌లో అశాంతి శుక్రవారం వరకు కొనసాగింది. అనేక మంది మరణాలకు దారితీసింది. నిరసనకారులు డజన్ల కొద్దీ సైనిక, ప్రభుత్వ స్థావరాలను ధ్వంసం చేశారు.
దేశ చరిత్రలో తొలిసారిగా, నిరసనకారులు రావల్పిండిలోని ఆర్మీ ప్రధాన కార్యాలయాన్ని (GHQ) ముట్టడించారు. లాహోర్‌లోని చారిత్రక కార్ప్స్ కమాండర్ హౌస్‌ను కూడా తగలబెట్టారు. పోలీసులు హింసాత్మక ఘర్షణల్లో మరణించిన వారి సంఖ్యను 10కి పెరిగింది అయితే ఖాన్ పార్టీ భద్రతా సిబ్బంది కాల్పుల్లో 40 మంది కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది. పంజాబ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ పోలీస్ డాక్టర్ ఉస్మాన్ అన్వర్ ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ఖాన్ అరెస్టు తర్వాత చెలరేగిన హింసలో పాల్గొన్నందుకు పంజాబ్ ప్రావిన్స్‌లో 3,500 మందికి పైగా అరెస్టు చేసినట్లు చెప్పారు. వీరిలో చాలా మందిని ఉగ్రవాద నిరోధక కోర్టుల్లో విచారిస్తామని చెప్పారు.