పాక్‌ కోర్టు సంచ‌ల‌న తీర్పు.. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు మూడేళ్ల జైలు శిక్ష‌

Pakistan ex-PM given three-year jail sentence. పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

By Medi Samrat  Published on  5 Aug 2023 3:22 PM IST
పాక్‌ కోర్టు సంచ‌ల‌న తీర్పు.. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు మూడేళ్ల జైలు శిక్ష‌

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వ బహుమతులను అక్రమంగా విక్రయించినందుకు (తోషాఖానా కేసు) ఇమ్రాన్ ఖాన్‌కు ట్రయల్ కోర్టు 3 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. తోషాఖానా కేసులో పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) చైర్మన్ ఇమ్రాన్‌ను జిల్లా సెషన్స్ కోర్టు దోషిగా నిర్ధారించింది. ఇమ్రాన్‌పై నిర్ణయం వెలువడిన వెంటనే పాకిస్థాన్ పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఇమ్రాన్ ఖాన్‌ను లాహోర్‌లో అరెస్టు చేశారు.

ఈ కేసులో దోషిగా తేలితే ఇమ్రాన్‌ఖాన్ రాజకీయ జీవితానికి తెరపడుతుందని న్యాయ నిపుణులు అంటున్నారు. నవంబరు ప్రారంభానికి ముందు జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఇమ్రాన్ పాల్గొనే అవకాశాలు చాలా తక్కువ.. ఆయ‌న 5 సంవత్సరాల వరకూ ఎన్నికల్లో పోటీ చేయలేర‌ని పేర్కొన్నారు.

ఇమ్రాన్ ఖాన్ 2018-2022 మధ్య ప్రభుత్వ బహుమతులను విక్రయించడం ద్వారా డబ్బు సంపాదించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇమ్రాన్ తన విదేశీ పర్యటనలో ఈ బహుమతులు అందుకున్నారు. పాకిస్తాన్ చట్టం ప్రకారం.., ఈ బహుమతులను స్టేట్ డిపాజిటరీ (తోషఖానా)లో ఉంచాలి. అయితే.. ఎవరైనా ప్రధానమంత్రి వాటిని తన వద్ద ఉంచుకోవాలనుకుంటే.. వేలం కింద ధర చెల్లించాల్సి ఉంటుంది.

ఈ బహుమతులను ఇమ్రాన్ తోషాఖానా నుంచి రూ.2.15 కోట్లకు కొనుగోలు చేసి రూ.5 కోట్లకు పైగా విక్రయించి భారీ లాభాలు గడించినట్లు ఆరోపణలున్నాయి. ఈ బహుమతులలో ఖరీదైన కార్లు, పెన్నులు, ఉంగరాలు కూడా ఉన్నాయని అంటున్నారు.

Next Story