ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్ పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలనే నిర్ణయం తీసుకుంది. పెట్రోల్ ధరను 12 రూపాయలు, డీజిల్ లీటరుకు 30 రూపాయల వరకు తగ్గించాలని పాకిస్థాన్ ప్రభుత్వం నిర్ణయించింది. పెట్రోలియం ఉత్పత్తులపై కొత్త ధరలు మే 16 నుంచి అమల్లోకి వచ్చాయి. అంతర్జాతీయంగా తగ్గుతున్న పెట్రోలియం ఉత్పత్తుల ధరల పూర్తి ప్రయోజనాన్ని సామాన్య ప్రజలకు అందజేయాలని పాకిస్థాన్ ప్రభుత్వం భావిస్తోంది. దేశంలో చమురు ధరలను తగ్గించాలని పాకిస్థాన్ ప్రభుత్వం నిర్ణయించడం ఇదే మొదటిసారి కాదు. ఈ నెల ప్రారంభంలో కూడా పాక్ ప్రభుత్వం ధరలను తగ్గించింది.
సోమవారం తన టెలివిజన్ ప్రసంగంలో, ప్రధాని షాబాజ్ షరీఫ్ ప్రజలకు భారం తగ్గేలా పెట్రోల్-డీజిల్ ధరలను తగ్గించాలని అనుకున్నామని అన్నారు. పెట్రోల్ ధర రూ.12 తగ్గిస్తున్నామని, దీని కారణంగా ఇప్పుడు కొత్త పెట్రోల్ ధర లీటర్ రూ.270కి చేరుతోందని పాక్ అధికారులు తెలిపారు. పాకిస్తాన్‌లో పెట్రోలియం ఉత్పత్తుల ధరలు 2022 నుండి పెరుగుతూనే ఉన్నాయి. పాక్ లో ఆకాశాన్నంటుతున్న ద్రవ్యోల్బణం, బలహీనమైన కరెన్సీ, ఆర్థిక కార్యకలాపాల మందగమనాన్ని చూస్తోంది. పాకిస్థాన్ అప్పుల ఊబిలో నుండి బయటపడడానికి ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంది.