అవినీతి కేసు.. ఇమ్రాన్ దంపతులకు 17 ఏళ్ల జైలు

పాకిస్థాన్‌లో జరిగిన భారీ అవినీతి కేసులో మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌, ఆయన సతీమణి బుష్రా బీబీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

By -  Medi Samrat
Published on : 20 Dec 2025 8:30 PM IST

అవినీతి కేసు.. ఇమ్రాన్ దంపతులకు 17 ఏళ్ల జైలు

పాకిస్థాన్‌లో జరిగిన భారీ అవినీతి కేసులో మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌, ఆయన సతీమణి బుష్రా బీబీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తోషాఖానా-II అవినీతి కేసులో ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (FIA) ప్రత్యేక కోర్టు వారిద్దరికీ 17 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. ఇమ్రాన్‌ఖాన్‌, బుష్రాబీబీలను దోషులుగా పేర్కొంటూ కోర్టు ఈ తీర్పు వెలువరించింది.

స్థానిక మీడియా నివేదికల ప్రకారం.. ఈ కేసు 2021 సంవత్సరానికి సంబంధించినది. సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ ఇమ్రాన్ ఖాన్‌కు చాలా ఖరీదైన బల్గారీ ఆభరణాల సెట్‌ను బహుమతిగా ఇచ్చారు. ఈ ఆభరణాల వాస్తవ విలువ 7 కోట్ల 15 లక్షల పాకిస్థాన్ రూపాయలకుపైగా ఉంటుందని, అయితే నిబంధనలను ఉల్లంఘించి కేవలం 58 లక్షల రూపాయలకే కొనుగోలు చేశారని విచారణలో తేలింది. ఇది ప్రజల విశ్వాసాన్ని కోల్పోడ‌మేన‌ని కోర్టు అభివర్ణించింది.

కోర్టు తీర్పు ప్రకారం ఇమ్రాన్‌ఖాన్‌కు నేరపూరిత విశ్వాస ఉల్లంఘన కింద 10 ఏళ్లు, అవినీతి నిరోధక చట్టం కింద 7 ఏళ్లు జైలు శిక్ష పడింది. బుష్రా బీబీకి కూడా ఇలాంటి సెక్షన్ల కింద మొత్తం 17 ఏళ్ల శిక్ష విధించారు. శిక్ష‌తో పాటు ఇద్దరికి రూ.1 కోటి 64 లక్షల జరిమానా కూడా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో అదనపు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.

అడియాలా జైలులో ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టు గదిలో ప్రత్యేక న్యాయమూర్తి షారుక్ అర్జుమంద్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇమ్రాన్ ఖాన్ వివిధ కేసుల్లో 2023 ఆగస్టు నుంచి జైలులో ఉండడం గమనార్హం. అంతకుముందు జనవరి 2025లో అల్-ఖాదిర్ ట్రస్ట్ కేసులో ఇమ్రాన్ ఖాన్‌కు 14 సంవత్సరాలు, బుష్రా బీబీకి 7 సంవత్సరాల శిక్ష పడింది.

అయితే, తోషఖానా-I కేసులో ఇస్లామాబాద్ హైకోర్టు ఏప్రిల్ 2024లో శిక్షను నిలిపివేసింది. ఇమ్రాన్ ఖాన్ న్యాయ బృందం తోషాఖానా-II కేసు ఈ నిర్ణయాన్ని కూడా హైకోర్టులో సవాలు చేస్తామని సూచించింది.

Next Story