భారత సైన్యం జరిపిన దాడుల్లో 11 మంది సైనికులు, 40 మంది పౌరులు మరణించారని పాకిస్తాన్ సైన్యం పేర్కొంది. ఏప్రిల్ 22 నుండి మే 10 వరకు జరిగిన ఈ సంఘర్షణను మార్కా-ఎ-హక్ (సత్య యుద్ధం) అని కూడా పిలిచింది. పాకిస్తాన్ ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ISPR) 11 మంది మరణించిన వారిలో ఆరుగురు సైన్యానికి చెందినవారు, ఐదుగురు పాకిస్తాన్ వైమానిక దళం (PAF) అధికారులు అని తెలిపింది.
భారతదేశం చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్'లో చీఫ్ టెక్నీషియన్ ఔరంగజేబ్‌తో సహా వైమానిక దళ సిబ్బందిని కోల్పోయినట్లు పాకిస్తాన్ ధృవీకరించింది. PAF కు చెందిన కొన్ని విమానాలను కూల్చివేసినట్లు భారత వైమానిక దళం చేసిన వాదనకు బలం చేకూరుస్తోంది. మే 8-9 తేదీల మధ్య రాత్రి పాకిస్తాన్ 36 ప్రదేశాలలో భారత వైమానిక ప్రాంతంలోకి చొరబడటానికి ప్రయత్నించినప్పుడు భారతదేశం ఒక F-16, రెండు JF-17 యుద్ధ విమానాలను కూల్చివేసిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. మే 7- 10 మధ్య పాకిస్తాన్ సైన్యానికి చెందిన కనీసం 35 నుండి 40 మంది సైనికులు మరణించారని భారత సైన్యం ఇప్పటికే తెలిపింది.