టారిఫ్ టెన్షన్.. వైట్‌హౌస్‌తో టచ్‌లోకి వెళ్లిన 50కి పైగా దేశాలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న సుంకాల విధానం కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై మాంద్యం ముప్పు పొంచి ఉంది.
By Medi Samrat
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న సుంకాల విధానం కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై మాంద్యం ముప్పు పొంచి ఉంది. ట్రంప్ విధానాలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే.. సుంకాలు విధించిన తర్వాత 50కి పైగా దేశాలు అమెరికాతో వాణిజ్య చర్చలు జరపాలనుకుంటున్నాయని ట్రంప్ ప్రభుత్వం పేర్కొంది. ఈ దేశాలన్నీ వైట్‌హౌస్‌తో టచ్‌లో ఉన్నాయని వెల్లడించింది.
గత బుధవారం సుంకాలను ప్రకటించినప్పటి నుండి 50కి పైగా దేశాలు అమెరికాతో చర్చలు ప్రారంభించాయని ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ చెప్పారు. ఎన్‌బిసి న్యూస్ 'మీట్ ది ప్రెస్' కార్యక్రమంలో ట్రంప్ సుంకాలు ప్రకటించడం ద్వారా గరిష్ట ప్రయోజనం పొందారని బెసెంట్ అన్నారు. మరోవైపు.. సుంకాలు కొన్ని వారాల పాటు అమలులో ఉంటాయని వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ చెప్పారు.
తైవాన్ అధ్యక్షుడు లై చింగ్-తే ఆదివారం ట్రంప్‌తో మాట్లాడారు. జీరో టారిఫ్‌ను ప్రాతిపదికగా చేయడానికి వారు అనుకూలంగా ఉన్నారు. లై అన్ని అడ్డంకులు తొలగిస్తామని హామీ ఇచ్చారు. తైవాన్ కంపెనీలు అమెరికాలో తమ పెట్టుబడులను పెంచుతాయన్నారు.
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అమెరికాతో చర్చలు జరుపుతున్నారు. సోమవారం ట్రంప్‌తో భేటీలో ఇజ్రాయెల్ వస్తువులపై విధించిన 17 శాతం సుంకాల నుంచి ఉపశమనం కల్పించాలని డిమాండ్ చేయనున్నట్లు తెలిపారు.
భారత్ కూడా అమెరికాతో చర్చలు జరుపుతోంది. రెండు దేశాలు మధ్యేమార్గాన్ని అనుసరించాలన్నారు. 26 శాతం టారిఫ్‌లపై ప్రతీకారం తీర్చుకోవడానికి దేశం ప్రణాళిక వేయడం లేదని భారత అధికారి రాయిటర్స్‌తో చెప్పారు. అమెరికాతో ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయన్నారు.
ఇటాలియన్ ప్రధాన మంత్రి జార్జియా మెలోని కూడా EU వస్తువులపై 20 శాతం సుంకాలను ఎదుర్కొంటున్న వ్యాపారాలను రక్షిస్తామని ఆదివారం ప్రతిజ్ఞ చేశారు.
ట్రంప్ టారిఫ్ విధానం వల్ల అమెరికా మార్కెట్‌లో భారీ ఒడిదుడుకులు చోటు చేసుకున్నాయి. గత వారంలో US స్టాక్ మార్కెట్ సుమారు $6 ట్రిలియన్లు పడిపోయింది. ట్రంప్ రెండవ టర్మ్ మొదలైన నాటినుంచి ప్రజలు మొత్తం 9 ట్రిలియన్ డాలర్ల నష్టాన్ని చవిచూశారు.
ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మాంద్యం భయం పెరిగింది. సుంకాల కారణంగా US GDP 0.3 శాతం క్షీణించవచ్చని JP మోర్గాన్ ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత నిరుద్యోగిత రేటు కూడా 4.2 నుండి 5.3 శాతానికి పెరుగనుంది.