పాకిస్థాన్ ప్రతీకార దాడి..130 మందికి పైగా ఆఫ్ఘన్ తాలిబన్లు మృతి

పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి.

By -  Knakam Karthik
Published on : 27 Feb 2026 1:48 PM IST

International News, Pakistan, Afghan Taliban, Operation Ghazab, Border Conflict

పాకిస్థాన్ ప్రతీకార దాడి..130 మందికి పైగా ఆఫ్ఘన్ తాలిబన్లు మృతి

పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఆఫ్ఘన్ తాలిబన్ల దాడులకు ప్రతిస్పందనగా పాకిస్థాన్ 'ఆపరేషన్ గజబ్ లిల్ హక్' పేరుతో భారీ ప్రతీకార దాడిని ప్రారంభించింది. గురువారం అర్ధరాత్రి మొదలైన ఈ ఆపరేషన్‌లో పాకిస్థాన్ వైమానిక దళం కాబూల్, కాందహార్, పక్తియాలోని తాలిబన్ల సైనిక స్థావరాలపై విరుచుకుపడింది. ఈ దాడుల్లో సుమారు 133 మంది తాలిబన్ ఫైటర్లు మరణించారని, మరో 200 మందికి పైగా గాయపడ్డారని పాక్ సమాచార మంత్రి అతావుల్లా తరార్ వెల్లడించారు. అంతేకాకుండా తాలిబన్లకు చెందిన 27 పోస్టులు, 80కి పైగా ట్యాంకులు, యుద్ధ విమానాలు, ఆయుధ డిపోలను ధ్వంసం చేసినట్లు పాక్ ప్రకటించింది.

ఆఫ్ఘన్ తాలిబన్లు అమాయక పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడికి దిగడం వల్లే తాము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ పేర్కొన్నారు. తాలిబన్లు ఆఫ్ఘనిస్థాన్‌ను భారతదేశానికి కాలనీగా మార్చారని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉగ్రవాదులను అక్కడ చేర్చి ఉగ్రవాదాన్ని ఎగుమతి చేస్తున్నారని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. పాక్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ మరియు ప్రధాని షెహబాజ్ షరీఫ్ స్పందిస్తూ.. తమ దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తే సహించేది లేదని, ఇది నిర్ణయాత్మకమైన యుద్ధమని స్పష్టం చేశారు. ఇన్నాళ్లూ అఫ్ఘన్ శరణార్థులకు ఆశ్రయమిచ్చి ఓపిక పట్టామని, కానీ ఇప్పుడు తమ సహనం నశించిందని పాక్ హెచ్చరించింది.

Next Story