అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. ఓక్లహామా రాష్ట్రంలోని తుల్సాలో ఉన్న సెయింట్ ప్రాన్సిస్ ఆస్పత్రి క్యాంపస్ భనవంలో ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా 10 మందికి పైగా గాయపడ్డారు.
వివరాల్లోకి వెళితే.. సెయింట్ ఫ్రాన్సిస్ ఆస్పత్రికి ఓ దుండగుడు వచ్చాడు. ఆర్థోపెడిక్ సర్జన్ కలవాలని అనుకున్నాడు. అయితే.. ఆ సమయంలో వైద్యుడు అందుబాటులో లేకపోవడంతో విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ కాల్పుల్లో ఓ డాక్టర్ సహా ఇద్దరు నర్సులు ప్రాణాలు కోల్పోయారు. అనంతరం దుండగుడు తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
భారత కాలమానం ప్రకారం గురువారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. అక్కడి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. కాగా.. కాల్పులు జరిగే సమయంలో భయాందోళనకు గురైన వైద్య సిబ్బంది రోగులను సురక్షిత ప్రాంతానికి తరలించారు.
ఇదిలా ఉంటే.. కొద్దిరోజుల క్రితం అమెరికాలో సాల్వడార్ రామోస్(18) మారణహోమం సృష్టించిన సంగతి తెలిసిందే. ఓ ఎలిమెంటరీ స్కూల్లోకి చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో 19 మంది విద్యార్థులతో పాటు ఇద్దరు ఉపాధ్యాయులు మృతి చెందారు. టెక్సాస్ రాష్ట్రంలో శాన్ ఆంటోనియోకు 134 కిలోమీటర్ల దూరంలోని ఉవాల్డే టౌన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.