విడాకుల వార్తలకు ట్వీట్‌తో ఆన్సర్ చెప్పిన ఒబామా

అమెరికా మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా, ఆయన భార్య మిషెల్ విడాకులు తీసుకుంటున్నారనే వార్తలు నెట్టింట వైరల్‌గా మారాయి.

By Knakam Karthik  Published on  18 Jan 2025 9:24 AM IST
INTERNATIONAL NEWS, AMERICA, OBAMA, MICHELLE, TRUMP SWEARING

విడాకుల వార్తలకు ట్వీట్‌తో ఆన్సర్ చెప్పిన ఒబామా

అమెరికా మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా, ఆయన భార్య మిషెల్ విడాకులు తీసుకుంటున్నారనే వార్తలు నెట్టింట వైరల్‌గా మారాయి. వీరిద్దరు కొన్ని రోజులుగా దూరంగా ఉంటున్నారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అదొక్కటే కాదు గతంలోనే ఈ జోడీ విడిపోదామని ప్రయత్నించారని, చివరకు కౌన్సెలింగ్ వల్ల తిరిగి తమ మనస్సులు మార్చుకుని ఒక్కటయ్యారని కథనాలు వచ్చాయి.

ఈ క్రమంలోనే బరాక్ ఒబామా చేసిన ట్వీట్‌తో విడాకుల వార్తలకు బ్రేక్ పడినట్లయింది. తన భార్య మిషెల్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ బరాక్ ఒబామా ట్వీట్ చేశారు. జీవితపు ప్రేమకు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ రాసుకొచ్చిన ఆయన, మిషెల్‌తో కలిసి జీవితంలోని సాహసాలను చేయగలిగేందుకు వచ్చిన అవకాశాన్ని అదృష్టంగా భావిస్తున్నట్లు బరాక్ ఒబామా తెలిపారు.

విడాకుల రూమర్స్‌పై అంతకు ముందు మిషెల్ టీమ్ క్లారిటీ ఇచ్చింది. బరాక్ ఒబామా, మిషెల్ ఒబామాల మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవని, అలాంటి వార్తల్లో వాస్తవం లేదని తెలిపింది. ఇవన్నీ రూమర్స్ అంటూ కొట్టి పారేశారు. ఇలాంటి నిరాధార రూమర్స్ వ్యాప్తి చేయడం మానుకోవాలని మిషెల్ టీమ్ సూచించింది. ఇటీవల అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ అంత్యక్రియల కార్యక్రమంలో మిషెల్ ఒబామా తన వ్యక్తిగత పనుల మీద ఇతర దేశంలో ఉన్నారని, అందుకే హాజరుకాలేదని ఆమె టీమ్ తెలియచేసింది.

ఇక అమెరికా నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్న డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారానికి రావడం ఇష్టం లేకపోవడం వల్లనే హాజరుకావడం లేదని మిషెల్ టీమ్ వెల్లడించింది. అధ్యక్షుడి ప్రమాణస్వీకారానికి మాజీ అధ్యక్షులు, వారి భార్యలు హాజరుకావడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఆ సంప్రదాయాన్ని మిషెల్ బ్రేక్ చేయనున్నారు. ఇకపోతే గతంలో బరాక్ ఒబామా ఫ్యామిలీ, నల్ల జాతీయులపై.. డొనాల్డ్ ట్రంప్ జాత్యాంహకార వ్యాఖ్యల వల్లే ఆయన ప్రమాణ స్వీకారానికి దూరంగా ఉంటున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో విడాకుల వార్తలపై అటు బరాక్ ఒబామా ట్వీట్, మిషెల్ టీమ్ స్పందించడంతో ఇద్దరి విడాకుల వార్తల ఊహాగానాలకు ఫుల్ స్టాప్ పడింది.

Next Story