భారతదేశం-పాకిస్తాన్ మధ్య ఇటీవల చోటు చేసుకున్న ఉద్రిక్తతలకు సంబంధించి పలు ఆందోళనలు ప్రపంచ దేశాలు వ్యక్తం చేశాయి. ముఖ్యంగా కిరానా హిల్స్ పై భారత్ దాడి చేసిందనే ఆరోపణలు రాగా వాటిని భారత భద్రతా దళాలు తిరస్కరించాయి. అయితే ఏ అణు కేంద్రం నుండి రేడియేషన్ లీక్ కాలేదని గ్లోబల్ న్యూక్లియర్ వాచ్‌డాగ్ IAEA తెలిపింది.
ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ అణు కేంద్రాలను భారత సాయుధ దళాలు ధ్వంసం చేశాయని సోషల్ మీడియాలో వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (IAEA) ప్రకటన వచ్చింది. “IAEAకి అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, పాకిస్తాన్‌లోని ఏ అణు కేంద్రం నుండి రేడియేషన్ లీక్ లేదా విడుదల జరగలేదు” అని IAEA ప్రతినిధి PTIకి తెలిపారు.
అంతకుముందు, ఎయిర్ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ ఎయిర్ మార్షల్ ఎ.కె. భారతి, పాకిస్తాన్ అణు స్థావరాలకు నిలయమైన కిరానా హిల్స్‌పై భారతదేశం దాడి చేసిందనే వాదనలను తిరస్కరించారు. భారతదేశం చేసిన దాడులు సర్గోధలోని వైమానిక స్థావరాన్ని తాకాయి.