చైనాలో ఒకటి కాదా.. నాలుగు వేరియంట్లా..!
Not One 4 Virus Variants Causing China Surge.కరోనా మహమ్మారి మరోసారి ప్రపంచదేశాలను వణికిస్తోంది
By తోట వంశీ కుమార్ Published on 28 Dec 2022 5:04 AM GMTకరోనా మహమ్మారి మరోసారి ప్రపంచదేశాలను వణికిస్తోంది. ముఖ్యంగా చైనాలో కరోనా విలయతాండవం చేస్తోంది. లక్షల సంఖ్యలో కేసులు నమోదు అవుతుండగా వేల సంఖ్యలో ప్రజలు మరణిస్తున్నారని పలు నివేదికలు చెబుతున్నాయి. అయితే అధికారికంగా చైనా ప్రభుత్వం ఎలాంటి సమాచారాన్ని బయటకు రానివ్వడం లేదు. ఇక చైనాలో భారీ సంఖ్యలో కొవిడ్ కేసులు నమోదు కావడానికి బీఎఫ్ 7 ఒక్కటే కారణం కాదని మూడు లేదా నాలుగు వేరియంట్లు కారణమని భారత కొవిడ్ ప్యానెల్ చీఫ్ ఎన్‌కే అరోరా తెలిపారు.
ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. చైనాలో కరోనా వ్యాప్తిని చూసి భయపడాల్సిన అవసరం లేదన్నారు. చైనా నుంచి సరైన సమాచారం లేకపోవడంతో భారత్ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు. చైనాలో నమోదు అవుతున్న పాజిటివ్ కేసుల్లో బీఎఫ్ 7 వేరియంట్ కేసులు కేవలం 15 శాతం మాత్రమేనని అన్నారు. 50 శాతం కేసులు బీఎన్, బీక్యూ వేరియంట్ల కేసులే ఉంటాయన్నారు. ఎస్వీవీ వేరియంట్ కేసులు 10 నుంచి 15 శాతం నమోదు అవుతున్నాయని తెలిపారు.
మన దేశంలోని ప్రజల్లో హెబ్రీడ్ ఇమ్యూనిటీ కారణంగా భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఈ హెబ్రీడ్ ఇమ్యూనిటీ.. టీకాల ద్వారా, ఇన్ఫెక్షన్ల ద్వారా, కొవిడ్ మొదటి, రెండు, మూడవ వేవ్‌ల కారణంగా లభించిందన్నారు. ఇక చైనాలో వారికి ఇది కొత్త. ఇంతకముందు వారు ఇన్ఫెక్షన్ల బారిన పడలేదు. వారు తీసుకున్న వ్యాక్సిన్లు చాలా తక్కువ ప్రభావంతమైనవి అనుకుంటా. చాలా మంది మూడు, నాలుగు డోసులు తీసుకున్నారు. అని అరోరా అన్నారు.
మన దేశం విషయానికి వస్తే 97 శాతం మంది ప్రజలు రెండు డోసుల టీకాలు తీసుకున్నారు. మిగిలిన వారు కనీసం ఒక్కసారైన కరోనా బారిన పడ్డారు. చిన్నారులు కూడా సురక్షితమే. ఎందుకంటే 12 ఏళ్లలోపు చిన్నారుల్లో 96 శాతం మంది ఒక్కసారైన వైరస్ బారిన పడి కోలుకున్నట్లు ఆయన చెప్పారు. ఈ క్రమంలో చూస్తే మనం చాలా సురక్షితంగా ఉన్నట్లు బావిస్తున్నట్లు చెప్పారు.