వ‌చ్చే వారం ట్రంప్ దక్షిణ కొరియా ప‌ర్య‌ట‌న‌.. ఉత్త‌ర కొరియా ఏం చేసిందంటే..?

ఐదు నెలల్లో ఉత్తర కొరియా తొలి బాలిస్టిక్ క్షిపణి పరీక్షను నిర్వహించింది.

By -  Medi Samrat
Published on : 22 Oct 2025 10:17 AM IST

వ‌చ్చే వారం ట్రంప్ దక్షిణ కొరియా ప‌ర్య‌ట‌న‌.. ఉత్త‌ర కొరియా ఏం చేసిందంటే..?

ఐదు నెలల్లో ఉత్తర కొరియా తొలి బాలిస్టిక్ క్షిపణి పరీక్షను నిర్వహించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహా ప్రపంచవ్యాప్తంగా పలువురు సీనియర్ నేతలు దక్షిణ కొరియాలో పర్యటించనున్న తరుణంలో ఈ క్షిపణి పరీక్ష జరిగింది. దక్షిణ కొరియా సైన్యం అనేక స్వల్ప-శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను ఒకదాని తర్వాత ఒకటిగా గుర్తించింది. ఈ క్షిపణులన్నీ ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్‌లోని దక్షిణ భాగం నుంచి ప్రయోగించబడ్డాయి.

ఉత్తర కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ప్రకారం.. ఉత్తర కొరియా గతంలో అనేక క్షిపణులను పరీక్షించింది. అయితే అవి ఎల్లప్పుడూ కొరియా ఖండం, జపాన్ మధ్య సముద్రంలో ప్రయోగించబడ్డాయి. కానీ, ఈసారి ఉత్తర కొరియా ఈశాన్య దిశలో క్షిపణిని ప్రయోగించింది. అయితే ఈ క్షిపణి ఏ దిశలో ఎంత దూరం వెళ్లిందనే సమాచారం అందుబాటులో లేదు.

ఉత్తర కొరియా చేస్తున్న ఈ ఎత్తుగడపై అమెరికా, జపాన్‌తో పాటు దక్షిణ కొరియా కూడా ఓ కన్నేసి ఉంచింది. జపాన్ రియల్ టైమ్ మిస్సైల్ వార్నింగ్ డేటాను అమెరికా, దక్షిణ కొరియాలతో పంచుకుంటుందని జపాన్ కొత్త ప్రధాని సనే తకైచి చెప్పారు. అయితే జపాన్ భూభాగంలోకి క్షిపణి చేరలేదు.

వచ్చే వారం దక్షిణ కొరియాలో ఆసియా-పసిఫిక్ ఆర్థిక సహకార వార్షిక శిఖరాగ్ర సమావేశం జరుగుతుంది. ఈ సదస్సులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ పాల్గొననున్నారు.

Next Story